Begin typing your search above and press return to search.

ధర్మాన శల్యసారధ్యం ... ఇరుకునపెడుతున్న పెద్దాయన...?

By:  Tupaki Desk   |   1 Nov 2022 3:55 AM GMT
ధర్మాన శల్యసారధ్యం ... ఇరుకునపెడుతున్న పెద్దాయన...?
X
ఆయన సీనియర్ మోస్ట్ మంత్రి గారు. మూడు దశాబ్దాల పైగా రాజకీయాల్లో ఉంటూ వచ్చారు. ఇపుడు కూడా కీలకమైన రెవిన్యూ శాఖ మంత్రిగా ఉంటున్నారు. ఆరు నెలలు అయింది ఆయన మంత్రి అయి. శాఖకు సంబంధించిన ప్రకటనలు, విధానపరమైన నిర్ణయాల సంగతేమో కానీ ధర్మాన మాత్రం ఉత్తరాంధ్ర సెంటిమెంట్ ని రాజేసే పనిలో బాగా పడ్డారు. గత నెల రోజులుగా ఈ పెద్దాయన స్టేట్మెంట్స్ ఒక్కసారి చూస్తే ఆయన ఉత్తరాంధ్రాకే మంత్రా లేక ఏపీ మొత్తానికా అన్న డౌట్ ఎవరికైనా రాక మానదు.

నిజమే తాము పుట్టిన ప్రాంతం మీద ప్రేమ ఉంటే ఉండవచ్చు. అలాగే విశాఖకు రాజధాని కావాలని కోరిక ఉండవచ్చు. అంత మాత్రం చేత ఆయన ఏకంగా ఉద్యమకారుడి కంటే ఎక్కువగా మాట్లాడితే ఎలా అని ఒక వైపు విమర్శలు వస్తున్నాయి. ఇక రాజీనామా చేస్తానని మంత్రి పదవి కంటే ఆందోళనకారుడి పదవే తమకు ఎంతో పెద్దది అని చెప్పుకుంటూ వచ్చిన ధర్మాన జగన్ నో అనడంతో దానిని కూడా అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నారు. జగన్ వద్దని చెప్పారు కానీ నిజానికి మంత్రి పదవి నాకు వద్దే వద్దు అని చెబుతున్నారు.

ఇపుడు ఏకంగా ఆయన విశాఖ రాజధాని మీద మాట్లాడుతున్న మాటలు శృతి మించేశాయని అంటున్నారు. విశాఖపట్నం రాజధాని అంటే ఏమనుకుంటున్నారు. ఏకంగా అదే అసలైన రాజధాని, అమరావతిలో ఏముంటుంది శాసన సభ సమావేశలు జరిగితే కొన్ని రోజులు హడావుడి అంతే. ఇక కర్నూల్ హై కోర్టు కి వెళ్లేవారు అంతా కక్షిదారులు తప్ప వేరొకరు కాదు.

సో రాజధాని అంటే పక్కాగా విశాఖలోనే ఉంటుంది ఇది మనకు మంచి అవకాశం అని ఆయన చెబుతున్నారు. ఏకైక రాజధాని విశాఖే అని ఉత్తరాంధ్రా వాసులకు చెప్పాలనుకుంటున్న ధర్మాన అదే టైం లో ఏపీలో మిగిలిన ప్రాంతాలకు తెలియకుండానే తమ ప్రభుత్వం అన్యాయం చేస్తోంది అని చెప్పేస్తున్నారు అని అంటున్నారు.

అమరావతి రాజధానిగా ఉంటే మరో యాభై ఏళ్లకు అయినా ఉత్తరాంధ్రా విడిపోవాల్సిందే అని అంటున్న పెద్దాయన ఎక్కడో విశాఖలో రాజధాని వస్తే రాయలసేమ వాసులు వేర్పాటు ఉద్యమాలకు ఎందుకు సిద్ధపడరు అన్న దానిని ఆలోచించడం లేదా అని ప్రశ్నలు వస్తున్నాయి.

మూడు ప్రాంతాలకు సమాన న్యాయం, మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి అన్న అజెండాతో వైసీపీ ప్రభుత్వం ముందుకు పోతూంటే తాపీగా ధర్మాన సార్ ఆ సారాన్ని సారాంశాన్ని పక్క దోవ పట్టిస్తూ వక్ర భాష్యం చెబుతూ తనకు ఉన్న ఉత్తరాంధ్రా ప్రేమతో ఏపీలో మిగిలిన రెండు ప్రాంతాలను వైసీపీకి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు.

మరి ఆయన ఇదంతా తెలిసి చేస్తున్నారా లేక ఉత్తరాంధ్రా ప్రేమలో పడి అనాలోచితంగా అంటున్నారా అన్నది తెలియదు కానీ ఆయన మాత్రం వైసీపీకి డ్యామేజి కలిగే విధంగానే మాట్లాడుతున్నారు అని అంటున్నారు. మరి ఇప్పటికే ధర్మాన వల్ల ఆయన రాజీనామా ప్రకటనల వల్ల ఇరుకున పడిన వైసీపీ హై కమాండ్ పెద్దాయన ఉత్తరాంధ్రా ప్రేమకు కాస్తా అడ్డుకట్ట వేయకపోతే మూడు రాజధానుల సంగతి తరువాత ముందు హార్డ్ కోర్ రీజియన్ గా వైసీపీకి ఉన్న రాయలసీమ సహా మిగిలిన కోస్తా ప్రాంతాలు దూరం అయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.