Begin typing your search above and press return to search.

మంత్రి వ్యాఖ్య‌ల‌పై మాజీ మంత్రి గుర్రు.. ధ‌ర్మాన కుటుంబంలో రాజ‌కీయ మంట‌లు?

By:  Tupaki Desk   |   18 April 2022 1:30 AM GMT
మంత్రి వ్యాఖ్య‌ల‌పై మాజీ మంత్రి గుర్రు.. ధ‌ర్మాన కుటుంబంలో రాజ‌కీయ మంట‌లు?
X
శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ కుటుంబం ధ‌ర్మాన ఫ్యామిలీలో రాజ‌కీయ మంట‌లు అలుముకున్నాయి. అన్న ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌.. త‌మ్ముడు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావులు ఇద్ద‌రూ కూడా సుదీర్ఘ కాలంగా రాజ‌కీయాల్లో ఉన్నారు. కాంగ్రెస్‌లోనూ ఎమ్మెల్యేలుగా ప‌నిచేశారు. ఇక‌, ఇప్పుడు కూడా వారు ప్ర‌జాప్ర‌తినిదులుగా ఉన్నారు. అన్న ధ‌ర్మాన కృష్ణ‌దాస్ న‌ర‌స‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి, త‌మ్ముడు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు.. శ్రీకాకుళం నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2019లో విజ‌యంద‌క్కించుకు న్నారు. వైఎస్ కుటుంబంతో ఉన్న ప‌రిచ‌యాల నేప‌థ్యంతో ఇద్ద‌రికీ సీఎం జ‌గ‌న్ ప్రాధాన్యం ఇచ్చారు.

ఈ క్ర‌మంలోనే గ‌త కేబినెట్లో కృష్ణ‌దాస్‌ను మంత్రిగా తీసుకున్నారు. రెండో మంత్రి వ‌ర్గం జ‌గ‌న్ కేబినెట్ 2.0లో ప్ర‌సాద‌రావుకు అవ‌కాశం ఇచ్చారు. అయితే.. అన్న చూసిన రెవెన్యూ శాఖ‌నే త‌మ్ముడికి అప్ప‌గించారు.. సీఎం జ‌గ‌న్‌. దీంతో ఒకే కుటుంబం నుంచి ఒకే శాఖ‌ను నిర్వ‌హించే అవ‌కాశం వ‌చ్చింది. అయితే.. తాజాగా మంత్రి ప‌ద‌విని చేప‌ట్టిన ధ‌ర్మాన ప్ర‌సాద‌రావుకు.. శ్రీకాకుళంలో పెద్ద ఎత్తున కార్య‌క్ర‌మం నిర్వ‌హించి.. స‌న్మానం చేశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ధ‌ర్మాన కుటుంబంలో మంటలు రేపాయి. రెవిన్యూ శాఖలో అవినీతి పేరుకుపోయిందని, అవినీతి లేని విధంగా పాల‌న అందిద్దామ‌ని.. ప్ర‌సాద‌రావు చేసిన ప్ర‌క‌ట‌న రాజ‌కీయంగా ప్ర‌భుత్వానికి.. అటు కుటుంబంలోనూ ప్ర‌కంప‌న‌లు సృష్టించింది.

ఈ వ్యాఖ్యల‌పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా చూస్తే రెవెన్యూ శాఖను అప్పటి వరకూ నిర్వహించింది తన అన్న ధర్మాన కృష్ణదాసే. అంటే.. అన్నపైనే తమ్ముడు ప్రసాదరావు తీవ్ర ఆరోపణలు చేశారన్నమాట. ఈ విషయంలో కృష్ణదాసు గుర్రుగా ఉన్నారు. అయితే.. బ‌య‌ట‌ప‌డి ఏదైనా కామెంట్లు చేస్తే.. మ‌రింత వివాదం అవుతుంద‌ని అనుకుంటున్నారేమో.. తెలియ‌దు కానీ.. ప్ర‌స్తుతానికి సైలెంట్‌గా ఉన్నారు. కానీ, రెవెన్యూ శాఖ‌ ఉద్యోగులు మాత్రం ఆగ్ర‌హం ఆవేద‌న రెండూ వ్య‌క్తం చేస్తున్నారు.

ఏపీ రెవెన్యూ సర్వీసెస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఈ వ్యాఖ్య‌ల‌పై ఫైర‌య్యారు. ధర్మాన తమను అవినీతి పరులు అనడం ఏమిటన్నారు. నిజాయితీగా పని చేసేది తామేనన్నారు. ధ‌ర్మాన చేసిన వ్యాఖ్య‌ల‌తో ఉద్యోగులు మాన‌సికంగా ఇబ్బంది ప‌డే ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. సీనియర్ మంత్రిగా ధర్మాన అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని అభిప్రాయ ప‌డ్డారు. కనీసం తన అన్న చూసిన రెవెన్యూ శాఖ‌లో ఏవైనా లోపాలు ఉంటే.. అంత‌ర్గ‌తంగా చ‌ర్చించి.. స‌రిచేసి ఉంటే.. బాగుండేద‌నే అభిప్రాయం కూడా వ్య‌క్త‌మ‌వుతోంది.

వైసీపీలో జగన్ వెంట మొదట నడిచింది ధర్మాన కృష్ణదాసు. అన్నీ అనుభవించి చివరిలో వైసీపీలో చేరింది ప్రసాదరావు. ఇప్పుడు అన్న మంత్రి పదవిని ఆయ‌న‌ పొందారు ఈ క్ర‌మంలో ఈ వ్యాఖ్య‌లు.. ఇటు ప్ర‌భుత్వానికి కూడా ఇబ్బందిగా మారాయి. ప‌రోక్షంగా ఆయ‌న ప్ర‌భుత్వంపైనా అవినీతి మ‌ర‌క‌లు అంటించార‌ని.. ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. దీనిపై సీఎం జ‌గ‌న్ , స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాల‌ని అంటున్నారు.