Begin typing your search above and press return to search.

చంద్రబాబు అరెస్ట్ వారెంట్ లో ట్విస్ట్

By:  Tupaki Desk   |   15 Sep 2018 7:16 AM GMT
చంద్రబాబు అరెస్ట్ వారెంట్ లో ట్విస్ట్
X
2010లో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర వెళ్లి ఆందోళన చేసిన సంగతి తెలిసిందే.. ఆ సమయంలోనే బాబుతో సహా 16మంది టీడీపీ ప్రజాప్రతినిధులపై మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఆ కేసు చాలా రోజులుగా పెండింగ్ లో ఉంది. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు ఏపీ సీఎం కావడం.. తదినంతర పరిణామాల్లో బీజేపీతో వైరం.. ఎన్టీఏ నుంచి బయటకు వచ్చారు. అయితే ఇప్పుడు ఏపీ సీఎంకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ కావడం చర్చనీయాంశమైంది. మోడీ రాజకీయ కక్ష సాధిస్తున్నారని బాబు ఆరోపిస్తున్నారు. కానీ తాజాగా బయటపడ్డ విషయం చంద్రబాబును ఇరుకున పెట్టింది.

బాబ్లీ ఆందోళన కేసులో ధర్మాబాద్ కోర్టు ఇప్పటి వరకూ చాలా సార్లు చంద్రబాబు సహా 16మందికి నోటీసులు జారీ చేసిందట.. ఇదే మొదటిసారి కాదని.. వారందరూ నోటీసులు జారీ చేసినా స్పందించని పరిస్థితుల్లోనే అన్ని కేసుల్లో మాదిరే ఇందులో కూడా తాజాగా నాన్ బెయిలబుల్ నోటీసులు జారీ చేశారని చెబుతున్నారు.

చంద్రబాబుకు నోటీసులపై తాజాగా ధర్మాబాద్ జడ్జి మీడియాతో స్పందించారు. ఈ కేసుకు సంబంధించి అందరికీ పలుమార్లు నోటీసులు పంపించామని.. పదహారు మందికి నోటీసులు పంపినప్పటికీ స్పందించలేదని ఆయన వివరణ ఇచ్చారు. దీంతో ఇప్పుడు అరెస్ట్ వారెంట్ జారీ చేశామని స్పష్టం చేశారు. ఈనెల 21లోగా హాజరు కావాలని లేదంటే తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు.

సరిగ్గా చంద్రబాబు శ్రీవారి ఆలయంలో ఉండగా ధర్మాబాద్ కోర్టు నోటీసుల వ్యవహారం అధికారికంగా తెలిసిందట.. దీంతో బాబు బయటకు రాగానే దీనిపై అధికారులు బాబుకు తెలిపారు. శుక్రవారం దీనిపై బాబు సమాలోచనలు జరిపారు.

అయితే చంద్రబాబు ఆరోపిస్తున్నట్టు కేవలం నోటీసులు ఆయనకే కాకుండా ప్రస్తుతం బీజేపీతో సన్నిహితంగా ఉన్న టీఆర్ ఎస్ నేతలకు కూడా (అప్పట్లో వీరు టీడీపీలో ఉన్నారు) నోటీసులు జారీ కావడం విశేషం. దీంతో ఇది కక్షసాధింపు కాదని.. కోర్టు కేసులో భాగంగానే నోటీసులు ఇచ్చిందనే వాదనకు బలం చేకూరుతోంది. ఏపీ సీఎం సహా 16 మంది ప్రజాప్రతినిధులకు నోటీసులు జారీ కావడంతో వారు ధర్మాబాద్ కోర్టు హాజరైతే తీసుకోవాల్సిన చర్యలపై మహారాష్ట్ర పోలీసులు సమీక్షించారు. కట్టుదిట్టమైన భద్రతకు పూనుకున్నారు.