Begin typing your search above and press return to search.

కొత్త రోడ్ రూల్స్ ఎఫెక్ట్..డీజీపీకే ఫైన్ పడిందబ్బా!

By:  Tupaki Desk   |   7 Sep 2019 9:58 AM GMT
కొత్త రోడ్ రూల్స్ ఎఫెక్ట్..డీజీపీకే ఫైన్ పడిందబ్బా!
X
రోడ్ సేఫ్టీ పేరిట ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త వాహనదారుల చట్టం తనదైన శైలిలో సంచలనాలను నమోదు చేస్తోంది. ఈ కొత్త రూల్స్ ఎఫెక్ట్ కారణంగా కొత్త ఫైన్లు వేస్తున్న పోలీసులకు బాస్ గా వ్యవహరించే డీజీపీకే ఫైన్ పడిన ఘటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ఆసక్తికర ఘటన ఎక్కడో జరగలేదు. మన తెలుగు నేలలోనే - తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది. తెలంగాణ డీజీపీగా పనిచేస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి మహేందర్ రెడ్డికి తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు రూ.1,135 ఫైన్ వేశారు.

ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే... కొత్త రోడ్ రూల్స్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రోడ్ రూల్స్ ను అతిక్రమించిన వారిపై సామాన్య ప్రజలు కూడా ఫిర్యాదు చేసే అవకాశం లభించింది. ఈ క్రమంలో తెలంగాణలోని సంగారెడ్డిలో ఓ కారు రాంగ్ రూట్ లో వెళుతున్న విషయాన్ని గుర్తించిన ఓ వ్యక్తి సదరు కారు ఫొటోను తీసి ట్రాఫిక్ పోలీసులకు పంపించారు. ట్రాఫిక్ పోలీసులు కూడా సదరు కారు రాంగ్ రూట్ లోనే వెళుతోందని నిర్ధారించి... సదరు కారు ఎవరిదన్న వివరాలు తీసి షాక్ తిన్నారట. ఆ కారు డీజీపీ మహేందర్ రెడ్డి పేరిట ఉందట. దీంతో చేసేది లేక డీజీపీ అయినా కూడా మహేందర్ రెడ్డికి రూ.1,135 ఫైన్ వేసి చలానాను డీజీపీ నివాసానికి పంపారట.

కొత్త రోడ్ రూల్స్ కారణంగా దేశవ్యాప్తంగా పలు సంచలన కేసులు నమోదవుతున్నాయి. ఈ నిబంధనలను అతిక్రమించే సామాన్యులపై భారీ ఫైన్లే విధిస్తుండగా, నిందితులు పోలీసులు అయిన పక్షంలో జరిమానాలు మరింత ఎక్కువగా ఉంటున్నాయి. ఈ క్రమంలో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన ఓ కానిస్టేబుల్ కు ఏకంగా సగం వేతనం కోత పడింది. ఈ తరహా ఘటనలు ఒక్కటొక్కటిగానే నమోదు అవుతుండగా... ఏకంగా ఓ రాష్ట్ర పోలీసు శాఖకే బాస్ గా ఉన్న డీజీపీకి ఫైన్ పడటం నిజంగానే ఆసక్తికరమే.