Begin typing your search above and press return to search.

రాజధాని తరలింపుపై డీజీపీ కీలక వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   6 July 2020 5:31 PM GMT
రాజధాని తరలింపుపై డీజీపీ కీలక వ్యాఖ్యలు
X
విశాఖపట్నంను ఏపీ పరిపాలన రాజధానిగా చేయాలనుకున్న సీఎం వైఎస్ జగన్ కరోనా లాక్ డౌన్ తో మూడు నెలలుగా ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు.. తాజాగా విశాఖ విషయంలో మరో కీలక ముందడుగు పడింది. విశాఖలో ఇప్పటికే సచివాలయం, సీఎం క్యాంప్ ఆఫీస్ శోధన జరుగుతోంది. తాజాగా పోలీస్ కార్యాలయాలను నెలకొల్పడానికి అవసరమైన భవనాల అన్వేషణ మొదలైంది. రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ రంగంలోకి దిగి విశాఖలో పర్యటించి పోలీస్ శాఖ భవనాల కోసం అన్వేషించారు. దీంతో విశాఖకు రాజధాని తరలింపు ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి.

విశాఖకు రాజధాని తరలింపుపై వ్యాఖ్యానించడానికి ఆంధ్రప్రదేశ్ డిజిపి గౌతమ్ సావాంగ్ తాజాగా నిరాకరించారు. కానీ ప్రభుత్వం మాత్రం సిద్ధంగా ఉందని తెలుపడం విశేషం. తన రెండు రోజుల విశాఖపట్నం పర్యటన పూర్తయిన తర్వాత విలేకరులతో మాట్లాడిన డీజీపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖకు రాజధాని ఎప్పుడు మార్చబడుతుందో నేను చెప్పలేను. కానీ మేము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేయగలము’ అని ఆయన అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఇంతకుముందే ‘ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ - అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి బిల్లు 2020’ ను ఆమోదించిందని ఆయన గుర్తు చేశారు.

విశాఖలోని ఆనందపురం మండలం తోట్లకొండలో ఉన్న గ్రేహౌండ్స్ స్థలాన్ని డీజీపీ సందర్శించారు. రాజధాని తరలింపుతోపాటు డీజీపీ, పోలీస్ కార్యాలయాల కోసమే డీజీపీ విశాఖను సందర్శించారని తెలుస్తోంది. విశాఖపట్నం నగరానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆనందపురం మండలంలోని చండక పంచాయతీల పరిధిలోని జగన్నాధపురం గ్రామంలో గ్రేహౌండ్స్ ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు, పోలీస్ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం 385 ఎకరాల భూమిని కేటాయించింది. కేటాయించిన భూమి పూర్తి స్థాయి ప్రధాన కార్యాలయానికి సరిపోదు కాబట్టి, మరికొంత భూమిని ప్రభుత్వం నుంచి కోరింది. గత రెండు రోజులలో మరెన్నో భూములను డీజీపీ పరిశీలించారు.