Begin typing your search above and press return to search.

ఏపీ పోలీస్ బాస్ సీరియస్ అయితే..సీన్ ఎలా మారుతుందంటే?

By:  Tupaki Desk   |   10 May 2020 4:42 AM GMT
ఏపీ పోలీస్ బాస్ సీరియస్ అయితే..సీన్ ఎలా మారుతుందంటే?
X
అన్ని సందర్భాలు అనుకున్నరీతిలో ఉండవు. అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇలాంటివేళలో అప్రమత్తంగా వ్యవహరించటమే కాదు.. తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విడి సందర్భాల్లో కూల్ గా ఉండటం పెద్ద విషయం కాదు. కానీ.. విపత్కర పరిస్థితుల్లో ఆగ్రహం లాంటి ఎమోషన్స్ ను బయటకు తీయటం వల్ల ఇష్యూ మరింత రచ్చ అవుతుందే తప్పించి.. మరింకేమీ ఉండదు. తాజాగా ఏపీలో అలాంటి సీనే చోటు చేసుకుంది.

విశాఖ ఎల్ జీ పాలిమర్స్ లో రసాయనం లీకైన సందర్భంలో ఎన్ని దారుణాలు చోటు చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటివేళలో.. ప్రజలు ఎదుర్కొన్న కష్టాలతో పాటు.. ప్రమాదం చోటు చేసుకున్న ఎల్ జీ పాలిమర్స్ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ వచ్చారు. ఆయన రాక గురించి తెలుసుకున్న బాధితులంతా ఎల్ జీ పాలిమర్స్ వద్దకు చేరుకున్నారు. కంపెనీకి వ్యతిరేకంగా నినాదాలు చేయటమే కాదు.. తక్షణమే తమకు న్యాయం చేయాలంటూ పట్టుపట్టారు.

నిత్యం కూల్ గా ఉండే పోలీస్ బాస్ కు ఏమైందో ఏమో కానీ.. ఆయన సీరియస్ అయ్యారు. కంపెనీ ఎదుట నిరసనకు దిగిన వారిని క్లియర్ చేయాలన్న మాట రావటంతో.. పోలీసులు తమ ప్రతాపాన్ని చూపించారు. ఈ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై స్థానికుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.అక్కడ ఏర్పాటు చేసిన టెంట్ ను పీకేయటమే కాదు.. అక్కడున్న వారిపై లాఠీలు ఝుళిపించటంతో సీన్ మొత్తం మారిపోయింది.

ప్రతికూల సమయాల్ని జాగ్రత్తగా డీల్ చేయాలే కానీ.. ఇష్యూ మరింత పెరిగేలా నిర్ణయాన్ని అసలే తీసుకోకూడదు. ఇందుకు భిన్నంగా ఏపీ పోలీస్ బాస్ తీరు ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ బ్యాలెన్స్ మిస్ కానీ.. సవాంగ్ సాబ్.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.