Begin typing your search above and press return to search.

రోడ్డెక్కిన టీటీడీ భక్తులు..సర్వదర్శనంపై ఆందోళన!!

By:  Tupaki Desk   |   20 Dec 2020 7:48 AM GMT
రోడ్డెక్కిన టీటీడీ భక్తులు..సర్వదర్శనంపై ఆందోళన!!
X
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు రోడ్డెక్కారు. సర్వదర్శనం టోకెన్ల జారీపై భక్తులు ఆందోళన చేశారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని సర్వదర్శనం టికెట్లు ముందుగానే జారీ చేయడంపై తిరుపతిలోని విష్ణు నివాసం ఎదుట భక్తులు ఆందోళనకు దిగారు.

డిసెంబర్ 24న దర్శనం టోకెన్లు ముందస్తుగా ఇవ్వడంపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేంటని అడిగితే అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. చిన్న పిల్లలు - వృద్ధులతో ఎక్కడ ఉండాలని నిలదీశారు. కుక్కలను తరిమినట్టు భక్తులను తరిమేస్తున్నామని మండిపడ్డారు. దర్శనం కోసం నాలుగైదు రోజులు ఎక్కడ ఉండాలని టీటీడీ అధికారులకు భక్తులు ప్రశ్నిస్తున్నారు.

స్వామి వారి దర్శనం కోసం 20న వస్తే డిసెంబర్ 24కి టికెట్లు ఇవ్వడం ఏంటని భక్తులు మండిపడ్డారు. అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

భక్తుల ఆందోళనపై టీటీడీ స్పందించింది. రోజువారీ కోటా పరిమితి దాటడంతో 24వ తేది టోకెన్లు ఇస్తున్నామని పేర్కొంది. డిసెంబర్ 21 - 22 - 23 తేదీల సర్వదర్శనం టోకెన్లు ముందుగానే జారీ చేసినట్లు వివరించింది.

అయితే భక్తులు నిలదీయడంతో సోమవారానికి అదనంగా 3వేల టోకెన్లు జారీ చేశారు. దీంతో భక్తులు ఆందోళన విరమించారు.

కరోనా నిబంధనల కారణంగా వైకుంఠ ఏకాదశి సర్వదర్శనం టోకెన్లు స్థానికుల మాత్రమే టీటీడీ పరిమితం చేసింది. దీనిపై కూడా భక్తుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది.