Begin typing your search above and press return to search.

సీఐడీకి సవాలు విసిరిన దేవినేని

By:  Tupaki Desk   |   20 April 2021 4:30 AM GMT
సీఐడీకి సవాలు విసిరిన దేవినేని
X
మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సీఐడీకే సవాలు విసిరారు. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి పై దేవినేని బురద చల్లేశారు. అప్పుడెప్పుడో అంటే ప్రత్యేకహోదా విషయంలో జగన్ చెప్పిన మాటలను తిరుపతి ఉపఎన్నికలకు అన్వయించి దేవినేని నోటికొచ్చినట్లు మాట్లాడారు. జగన్ వీడియో క్లిప్పింగులను మీడియా సమావేశంలో చూపించారు. అయితే అప్పట్లో తిరుపతిని ఉదహరిస్తు జగన్ మాట్లాడిన మాటలు వేరు, దేవినేని చూపించిన వీడియోలో ఆడియో వేరు.

ఇదే విషయమై వైసీపీ ఫిర్యాదుచేసింది. తన ఫిర్యాదుతో పాటు అప్పట్లో తిరుపతిని ఉదహరిస్తు జగన్ ఏమి మాట్లాడారు, ఇపుడు దేవినేని చూపించిన వీడియోలో ఏముంది అనే క్లిప్పింగులను కూడా జతచేశారు. రెండు వీడియో క్లిప్పింగులను చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే దేవినేని చూపించిన వీడియో క్లిప్పుంగులు మార్ఫింగని తేలిపోయింది.

జగన్ ఎక్కడెక్కడో అన్న మాటలను టీడీపీ జాగ్రత్తగా ఎడిట్ చేసి, ఒకదానికి మరొకటి ఎటాచ్ చేసి సంబంధంలేకుండా దేవినేని మీడియా సమావేశంలో ప్రదర్శించారు. మార్ఫుడు వీడియో అనే విషయం నిర్ధారణ అవ్వటంతో వెంటనే కేసును సీఐడీకి బదిలీచేశారు. దీంతో విచారణకు హాజరుకావాలంటు సీఐడీ అధికారులు దేవినేనికి నోటీసులిచ్చారు. 15వ తేదీన విచారణకు హాజరుకావాలని సీఐడీ చెప్పినా దేవినేని లెక్కచేయలేదు.

విచారణకు మాజీమంత్రి గైర్హాజరవ్వటంతో రెండో నోటీసిచ్చారు. దాని ప్రకారం 19వ తేదీన విచారణకు హాజరుకావాల్సుండగా దానికి కూడా హాజరుకాలేదు. అంటే రెండుసార్లు వాచరణకు హాజరు కాకపోవటంతో దేవినేనికి అసలు విచారణకు హాజరయ్యే ఉద్దేశ్యం లేదని అర్ధమైపోతోంది. ఇదే విషయమై సీఐడీ అధికారులు మాట్లాడుతు విచారణకు హాజరుకావాలని మూడోసారి నోటీసిస్తామన్నారు. అప్పుడు కూడా హాజరుకాకపోతే ఏమి చేయాలో అది చేస్తామన్నారు. మొత్తంమీద తొందరలోనే దేవినేని మీద చర్యలు తప్పేట్లు లేదు.