Begin typing your search above and press return to search.

ఎకసెక్కాలు ఓకే కానీ.. రివ‌ర్స్ అయితే క‌ష్ట‌మే దేవినేని?

By:  Tupaki Desk   |   20 April 2019 5:07 AM GMT
ఎకసెక్కాలు ఓకే కానీ.. రివ‌ర్స్ అయితే క‌ష్ట‌మే దేవినేని?
X
ప్ర‌త్య‌ర్థుల మీద మాట‌ల యుద్ధం బాగానే ఉంటుంది. కానీ.. దానికో ప‌రిమితి ఉంటుంది. తాజాగా ఏపీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు చేస్తున్న సెటైర్ల వ‌ర్షం ఇప్ప‌టికి ఓకే అయినా.. రానున్న రోజుల్లో ఏ మాత్రం తేడా కొట్టినా నోరు విప్పేందుకు కూడా ఛాన్స్ ఉండ‌ద‌ని ఆయ‌న మ‌ద్ద‌తుదారులు తెగ ఆందోళ‌న చెందుతున్నారు. పోటాపోటీగా సాగిన ఎన్నిక‌ల నేప‌థ్యంలో విజ‌యం ఎవ‌రిద‌న్న విష‌యం మీద నెల‌కొన్న ఉత్కంట అంతా ఇంతా కాదు.

ఎవ‌రికి వారు గెలుపు ధీమాను ప్ర‌ద‌ర్శిస్తున్న వేళ‌లో.. విజ‌యం ఎవ‌రిద‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. మ‌రో ఐదు వారాల్లో ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డి కానున్నాయి.

అప్ప‌టివ‌ర‌కూ కొన్ని మాట‌ల్ని దాచి పెట్టుకుంటే మంచిద‌న్న విష‌యాన్ని దేవినేని మిస్ అవుతున్నారు. అధినేత మ‌న‌సు దోచుకోవ‌టానికి ఉత్సాహంగా మాట్లాడుతున్న ఆయ‌న‌.. ప్ర‌త్య‌ర్థుల‌పై అన‌వ‌స‌రంగా నోరు పారేసుకుంటున్నారన్న భావ‌న అంత‌కంత‌కూ ఎక్కువ అవుతుంది. ప‌స లేని మాట‌లు మాట్లాడుతూ.. త‌న ఇమేజ్ ను త‌గ్గించుకునేలా దేవినేని తాజా మాట‌లు ఉంటున్నాయి.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించిన ప్ర‌శాంత్ కిశోర్ (పీకే) ను ఉద్దేశించి దేవినేని ఇటీవ‌ల కాలంలో త‌ర‌చూ వ్యాఖ్య‌లు చేస్తున్నారు. రూ.300 కోట్లు తీసుకున్న ఆయ‌న జ‌గ‌న్ చేతిలో నేమ్ ప్లేట్ పెట్టారంటూ వ్యంగ్య వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల కాలంలో సోష‌ల్ మీడియాలో వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి అని ఉన్న నేమ్ ప్లేట్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌టం తెలిసిందే.

ఈ నేమ్ ప్లేట్ మార్ఫింగ్ చేసిందా? నిజ‌మైన‌దా? అన్న‌ది తేల్లేదు. కానీ.. దేవినేని మాత్రం ఆ నేమ్ ప్లేట్ ను జ‌గ‌న్ కు పీకే ఇచ్చిన‌ట్లుగా ఆరోపిస్తున్నారు. తాజాగా మ‌రోసారి అదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. జ‌గ‌న్ కు చివ‌ర‌కు మిగిలేది నేమ్ ప్లేట్ అంటూ ఎక్కెసం చేశారు. దేవినేని మాట‌లు టీడీపీ వ‌ర్గాల‌కు సంతోషాన్ని ఇవ్వ‌టం ఖాయం. ఎందుకంటే.. ఆయ‌న మాదిరి క‌నీసం మాట్లాడే వారు ఆ పార్టీలో లేర‌న్న‌ది తెలిసిందే.

అయితే.. యుద్ధానికి ముందే అస్త్ర‌శ‌స్త్రాల్ని ఉప‌యోగించేస్తే.. వార్ మొద‌ల‌య్యాక ఉత్త చేతుల‌తో ఉండిపోవాల్సిన ప‌రిస్థితి. ఎన్నిక‌ల్లో గెలిస్తే.. దేవినేని మాట‌లు గొప్ప‌గా అనిపిస్తాయి. కానీ.. లెక్క తేడా వ‌స్తే.. ఇప్పుడింత‌లా చెల‌రేగిపోతున్న దేవినేని మ‌ళ్లీ నోరు విప్ప‌టానికి కూడా అవ‌కాశం ఉండ‌దు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ పార్టీ ప‌వ‌ర్లోకి రావ‌టానికి అవ‌కాశాలు ఉన్న‌ట్లుగా వెల్లువెత్తుతున్న అంచ‌నాల నేప‌థ్యంలో.. అన‌వ‌స‌ర వ్యాఖ్య‌లు చేసి ఆయాస‌ప‌డితే.. రేపొద్దున ఫ‌లితాలు వేరుగా ఉంటే నోరు విప్ప‌లేని ప‌రిస్థితుల్లోఇక దేవినేని వెళ్లిపోతారు. ప్ర‌తిప‌క్ష స్థానంలో కూర్చునే బాబుకు అండ‌గా నిల‌వాల్సిన వేళ‌.. పాత త‌ప్పుల‌కు స‌మాధానం చెప్పే ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని దేవినేని తొంద‌ర‌ప‌డి కొని తెచ్చుకోవ‌టంలో అర్థం లేదు. ఈ చిన్న లాజిక్ దేవినేని మాష్టారికి ఎందుకు త‌ట్టటం లేదంటారు?