Begin typing your search above and press return to search.

దేవినేని ప్రశ్నకు కేసీఆర్ సమాధానం చెప్పగలరా?

By:  Tupaki Desk   |   9 April 2019 8:13 AM GMT
దేవినేని ప్రశ్నకు కేసీఆర్ సమాధానం చెప్పగలరా?
X
గడిచిన కొద్ది రోజులుగా ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏపీ సీఎం చంద్రబాబు పైనా.. ఆంధ్రప్రదేశ్ మీదా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండానే తన ప్రచారాన్ని ముగిస్తున్నారు. ఎన్నికల ప్రచారం మరో రోజులో ముగుస్తుందన్న వేళలో.. ఆయన ఏపీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రోళ్లు మంచోళ్లంటూ కితాబులిస్తూ.. బాబు లాంటి కిరికిరిగాళ్లు ఒక పదిమంది ఉంటారన్నారు.

పోలవరం ప్రాజెక్టుకు తాము అడ్డుకోమని.. ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా కోసం తాము సపోర్ట్ చేస్తామన్న కేసీఆర్ మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అయితే.. కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సూటి ప్రశ్నలు సంధించారు. పోలవరం ప్రాజెక్టుకు అడ్డం కాదని చెబుతున్న కేసీఆర్.. సుప్రీంకోర్టులో ఎందుకు కేసులు వేశారో చెప్పాలని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు సంపూర్ణ మద్దతు ఇచ్చే పక్షంలో సుప్రీంలో కేసు వేయాల్సిన అవసరం ఏమిటో చెప్పాలన్నారు.

పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేస్తుందా? అని ప్రశ్నించిన దేవినేని.. పోలవరం ప్రాజెక్టు పనులు పునాదుల్ని దాటలేదని జగన్ చెప్పే మాటల్లో నిజం లేదన్నారు. 2019 నాటికి గ్రావిటీతో పోలవరం నీళ్లు గ్రామాలకు ఇచ్చే ఘనత బాబుకే దక్కతుందన్నారు.

తనను ఓడించేందుకు రూ.100 కోట్లు.. లోకేశ్ ను ఓడించేందుకు రూ.200 కోట్ల మొత్తాన్ని కేసీఆర్ పంపినట్లుగా దేవినేని ఆరోపించారు. పారుపల్లి నాగేశ్వరరావు అనే దళారీ వ్యాపారి ద్వారా ఈ భారీ మొత్తాన్ని పంపినట్లుగా దేవినేని చెప్పారు. మరి.. దేవినేని అడిగినట్లు.. తెలంగాణ అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టుకు ఏకగ్రీవంగా తీర్మానం చేస్తారా? అన్న ప్రశ్నకు కేసీఆర్ సమాధానం ఏమిటి?