Begin typing your search above and press return to search.

ఆ మంత్రికి జగన్ సూదిగాడంట

By:  Tupaki Desk   |   15 Sep 2015 6:48 AM GMT
ఆ మంత్రికి జగన్ సూదిగాడంట
X
అధికారపక్షాన్ని విపక్షం.. వైరి పక్షాన్ని అధికారపక్షం విమర్శించుకోవటం మామూలే. ఈ క్రమంలో కొందరు నిర్మాణాత్మకంగా విమర్శలు చేస్తూ ఆకట్టుకుంటే.. మరికొందరు మాత్రం ఇష్టారాజ్యంగా తిట్టేస్తుంటారు. తాజాగా ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ ను ఉద్దేశించి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అందుకు.. గోదావరి జిల్లాల్ని వణికించిన సూదిగాడితో జగన్ ను పోల్చటం విశేషం. ఎప్పుడు ఎవరిని గుచ్చుతాడో తెలీని సూదిగాడి మాదిరే.. విపక్ష నేత వైఎస్ జగన్ సైతం ఎప్పుడు ఎవరిని విమర్శలతో గుచ్చుతారో తెలీదంటూ ఎద్దేవా చేశారు. జగన్ మానసిక పరిస్థితి అర్థం కావటం లేదన్నారు. ఏం జరిగినా వెంటనే కుర్చీ దిగిపోవాలని జగన్ అంటున్నారని.. మాట్లాడితే రాజీనామా గురించి మాట్లాడుతున్నారంటూ విమర్శించారు.

ప్రతి దానికి రాజకీయం చేయటం తగదని.. శవ రాజకీయాలు చేస్తున్న జగన్.. శవాల్ని కూడా వదలట్లేదంటూ మండి పడ్డారు. ఇలాంటి వైఖరి మంచిది కాదని.. జగన్ తన తీరు మార్చుకోవాలని సూచించారు. ఇన్ని మాటలు చెబుతున్న దేవినేని ఉమ.. తమ అధినాయకుడు పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో చూస్తే బాగుంటుందేమో. అధికారంలో ఉన్న వారికి దాన్ని కాపాడుకోవటం.. లేని వారికి అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకోవటం మామూలేనన్న విషయం దేవినేని వ్యాఖ్యలు చూస్తే.. ఇట్టే అర్థమవుతుంది.