ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ సేవలను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పొందడాన్నిఏపీ భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఎద్దేవా చేశారు. జగన్ ఎంచుకున్న చాన్స్ ఫెయిల్యూర్ చాన్స్ అని విశ్లేషించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ బొక్కాబోర్లా పడ్డాడని తెలిపారు. విజయవాడలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎంతమంది ప్రశాంత్ కిశోర్ లను తెచ్చుకున్నా తమకు ఏమీకాదని దేవినేని ధీమా వ్యక్తం చేశారు.
ఇటీవల యూపీలో ప్రశాంత్ కిశోర్ సేవలు పొందిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి పట్టిన గతే ఇక్కడ జగన్‌కు పడుతుందని దేవినేని ఎద్దేవా చేశారు. గెలుపుపై జగన్ ధీమాగా ఉన్నప్పటికీ ఫలితం అలా ఉండదని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన పాపాలకు ఎంతో మంది ఐఏఎస్ అధికారులు బలయ్యారన్నారు. అలాంటి ప్రజలు జగన్ కు ఓటు వేయబోరని దేవినేని విశ్లేషించారు. కుల - మతాల పేరుతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని మంత్రి ఉమ ఆరోపించారు.