Begin typing your search above and press return to search.

ఉమా మాటలన్నీ ఉప్మా మాటలేనా?

By:  Tupaki Desk   |   22 July 2017 4:28 AM GMT
ఉమా మాటలన్నీ ఉప్మా మాటలేనా?
X
ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి ఉమామహేశ్వరరావుకు జగన్ ను ఆడిపోసుకోవడం అనేది నిత్యకృత్యంగా, రెగ్యులర్ ఎజెండాగా మారిపోయినట్లుగా కనిపిస్తోంది. ప్రతిరోజూ ఏదో ఒక సందర్భంలో జగన్ పేరును ముడిపెట్టి.. ఆయన మీద కాసేపు నిందలు వేయకపోతే ఆయనకు గడిచేలా లేదు. రాష్ట్ర గవర్నర్‌ ను విపక్షనేత వెళ్లి కలిస్తే కూడా ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. సెక్యూరిటీ లేకుండా ప్రెవేటు వాహనంలో ఎందుకెళ్లారు అని ఉమా ప్రశ్నిస్తున్నారు. గవర్నర్ వద్దకు ప్రతిపక్షనాయకుడు సెక్యూరిటీతో వెళ్లడానికి, వారిని మినహాయించి వెళ్లడానికి మధ్య ఏం తేడా ఉంటుందని ఆయన అనుకుంటున్నారో అర్థం కాని సంగతి అని పలువురు ఆశ్చర్యపోతున్నారు.

ఇదే సమయంలో ఎంపీ విజయసాయిరెడ్డి గురించి ఉమా చేస్తున్న ఆరోపణలు మరింత విస్తుగొలిపేలా ఉన్నాయని పలువురు భావిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ పరంగా ఉన్న అనుమతుల ఇబ్బందుల గురించి విజయసాయిరెడ్డి ఛత్తీస్ గఢ్ ఎంపీలకు చెప్పి రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారంటూ ఉమా ఆరోపిస్తున్నారు. ఇలాంటి మాటలు అనడం లో అసలు ఆయన ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని ప్రజలు అంటున్నారు. ఎందుకంటే.. పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు దానికి సంబంధించిన అనుమతులు వివరాలు ఏవీ కూడా రహస్య డాక్యుమెంట్లు కావు. అలాంటప్పుడు వాటిని విజయసాయిరెడ్డి ఛత్తీస్‌ గఢ్ ఎంపీలకు చెప్పడం ఏమిటో? అందులో రాష్ట్రానికి జరిగే ద్రోహం ఏమిటో అర్థం కావడం లేదు. విజయసాయిరెడ్డి రాష్ట్రాభివృద్ధి గురించి చిత్తశుద్ధి ఉన్న నేత గనుక.. పోలవరంకు కేంద్రం నుంచి నిదుల విడుదల గురించి సభలో ప్రశ్నించారు. కాకపోతే.. ఇప్పటిదాకా విడుదలైన నిధులకు రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా లెక్కలు చెప్పేదాకా కొత్త నిధులు ఇవ్వబోం అంటూ కేంద్రమంత్రి తెగేసి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు ఇవ్వలేని వైఫల్యాన్ని దిద్దుకోలేని మంత్రి ఉమామహేశ్వరరావు - నిధుల గురించి సభలో ఎంపి విజయసాయి అడగడాన్ని.. రాష్ట్రాభివృద్ధికి వ్యతిరేకంగా మాట్లాడడం అంటూ నిందలు వేయడం హాస్యాస్పదం అని ప్రజలు భావిస్తున్నారు. పోలవరం విషయంలో తమ వైఫల్యాలను దాచిపెట్టి, ప్రతిపక్షాలను బద్‌ నాం చేయడానికి దేవినేని ఉమా దీర్ఘకాలిక స్కెచ్ వేస్తున్నట్లుందని పలువురు అంటున్నారు.