Begin typing your search above and press return to search.

గుడివాడ‌కు దేవినేని!..తేల్చేసిన చంద్ర‌బాబు!

By:  Tupaki Desk   |   11 March 2019 4:46 PM GMT
గుడివాడ‌కు దేవినేని!..తేల్చేసిన చంద్ర‌బాబు!
X
సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు ఏపీ అసెంబ్లీకి కూడా షెడ్యూల్ విడుద‌లైపోయిన త‌రుణంలో అన్ని పార్టీలు కూడా అభ్య‌ర్థుల ఖ‌రారుపై క‌స‌ర‌త్తును ముమ్మ‌రం చేశాయి. ఎన్నిక‌ల షెడ్యూల్ తో ప‌నిలేకుండానే అభ్య‌ర్థుల ఖ‌రారుపై గ‌త కొన్ని రోజులుగా వ‌రుస స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తున్న టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు... ఇప్ప‌టికే చాలా సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశారు. అయితే పార్టీకి కీల‌కంగా మారిన సీట్ల‌తో పాటు విప‌క్షం వైసీపీకి దెబ్బేయ‌క త‌ప్ప‌ద‌ని భావిస్తున్న సీట్ల విష‌యంలో మాత్రం చంద్ర‌బాబు ఒక‌టికి రెండు సార్లు ఆలోచించి మ‌రీ నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు.

అంతేకాకుండా కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌మైన నేత‌ల‌ను బ‌రిలోకి దింపాల‌న్న చంద్ర‌బాబు యోచ‌న‌... ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పెద్ద ఎత్తున ర్చ‌కు కార‌ణ‌మ‌వుతోంది. ఈ త‌ర‌హా ర‌చ్చ నెల‌కొన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ కూడా ఒక‌టి. ఇక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ కీల‌క నేత కొడాలి శ్రీ‌వెంక‌టేశ్వ‌ర‌రావు (కొడాలి నాని)ని ఈ సారి ఎలాగైనా ఓడించాల్సిందేనన్న రీతిలో చంద్ర‌బాబు వ్యూహాలు ప‌న్నుతున్నారు. ఇందులో భాగంగా దివంగ‌త నేత‌ - మాజీ మంత్రి దేవినేని నెహ్రూ త‌న‌యుడు - పార్టీ యువ‌జ‌న విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు దేవినేని అవినాశ్ అభ్య‌ర్థిత్వాన్ని చంద్ర‌బాబు ప‌రిశీలించారు. ఈ విష‌యం తెలిసిన వెంట‌నే గుడివాడ‌కు చెందిన పార్టీ సీనియ‌ర్ నేత రావి వెంక‌టేశ్వ‌ర‌రావు అగ్గి మీద గుగ్గిల‌మ‌య్యారు. ఏళ్లుగా పార్టీకి అండ‌గా నిలుస్తున్న రావికి కాకుండా వ‌ల‌స నేత‌కు టికెట్ ఎలా ఇస్తార‌ని ఆయ‌న అనుచ‌రులు నానా యాగీ చేశారు.

అయితే నేటి ఉద‌యం నేరుగా రంగంలోకి దిగేసిన చంద్ర‌బాబు.. రావి వెంకటేశ్వ‌ర‌రావు తో నేరుగా మాట్లాడారు. పార్టీ విజ‌యం కోసం ప‌నిచేయాల‌ని - టికెట్ విష‌యంలో కొన్ని కొన్ని ప్రాతిప‌దిక‌లు ఉంటాయ‌ని - వాటి ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంద‌ని ఆయ‌న‌కు స‌ర్ది చెప్పారు. పార్టీ విజ‌యం కోసం కృషి చేసి అవినాశ్ ను గెలిపించుకుని రండి... భ‌విష్య‌త్తులో ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తాన‌ని ఆయ‌న ముందు చంద్ర‌బాబు మ‌రో ప్ర‌తిపాద‌న పెట్టారు. దీంతో చ‌ల్ల‌బ‌డిన రావి... చంద్రబాబు ప్ర‌తిపాద‌నకే ఓకే చెప్పేశారు. ఫ‌లితంగా దేవినేని అవినాశ్ ను గుడివాడ‌లో బ‌రిలో నిలిపేందుకు ఉన్న దాదాపుగా అన్ని అడ్డంకుల‌ను చంద్ర‌బాబు సింగిల్ మీటింగ్ లో ప‌రిష్క‌రించేశారు.