Begin typing your search above and press return to search.

మెడికల్ కిట్ల పై కోట్లు మింగేసిన దేవికారాణి

By:  Tupaki Desk   |   30 Oct 2019 8:01 AM GMT
మెడికల్ కిట్ల పై కోట్లు మింగేసిన దేవికారాణి
X
ఈఎస్ఐ మెడికల్ స్కామ్ విచారణలో రోజుకొక సంచలన విషయం వెలుగులోకి వస్తుంది. కొనని మందులకు ఇండెంట్లు సృష్టించి కోట్ల రూపాయలను దోచుకున్న ఐఎంఎస్ డైరెక్టర్ డాక్టర్ దేవికారాణి, ఆమెతో చేతులు కలిపిన సిబ్బంది గుట్టుని ఏసీబీ అధికారులు బయటపెడుతున్నారు. తాజాగా మెడికల్ కిట్ల స్కాం బయటపడింది. మెడికల్ కిట్ల పేరుతో కోట్ల రూపాయల నిధులు గోల్ మాల్ జరిగినట్లు ఏసీబీ తేల్చింది. ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణి సూత్రధారిగా, ఇతర సిబ్బంది పాత్రదారులుగా అక్రమాలకు పాల్పడినట్లుగా ఏసీబీ గుర్తించింది.

మెడికల్ కిట్ల కోసం 2017-18లో 60 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. ఇందుకు సంబంధించి 22 ఇండెంట్లు పెట్టి మెడికల్ కిట్లు కొన్నట్లు రికార్డుల్లో నమోదైంది. కానీ, మెడికల్ కిట్లు కొనకుండానే రికార్డులు సృష్టించి నిధులు పక్కదారి పట్టించినట్లు ఏసీబీ అధికారులు కనుగొన్నారు. ఇందులో హెచ్ ఐవీ కిట్ల పేరుతో కోటి 76 లక్షల రూపాయలు మింగేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో డైరెక్టర్, జేడీ కార్యాలయం సిబ్బంది పాత్రపై ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది.

ఈకేసులో డైరెక్టర్ దేవికారాణితోపాటు జాయింట్ డైరెక్టర్ పద్మ కొంతమంది మెడికల్ ఆఫీసర్లు దాదాపు 16 మందిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా దర్యాప్తులో కొన్ని కీలక విషయాలు అధికారుల దృష్టికి వచ్చాయి. మెడికల్ కిట్లను కొనుగోలు చేయకుండానే కొనుగోలు చేసినట్లుగా డాక్యుమెంట్లు సృష్టించి పెద్ద ఎత్తున నిధుల గోల్ మాల్ కు పాల్పడినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణి, జేడీ పద్మ, డైరెక్టరేట్, జేడీ కార్యాలయాల సిబ్బందికి భాగమున్నట్టు అధికారులు గుర్తించారు.