Begin typing your search above and press return to search.

మ‌రో సీఎంను ఢిల్లీకి తీసుకెళ్ల‌నున్న మోడీ

By:  Tupaki Desk   |   27 Aug 2017 5:00 AM GMT
మ‌రో సీఎంను ఢిల్లీకి తీసుకెళ్ల‌నున్న మోడీ
X
గ‌డిచిన కొంత కాలంగా త‌న టీంలో మార్పులు చేర్పులు చేయాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ భావిస్తున్న‌ట్లుగా వార్త‌లు రావ‌టం తెలిసిందే. ఇటీవ‌ల దీనికి సంబంధించిన క‌స‌ర‌త్తు జోరుగా సాగుతున్న‌ట్లుగా చెబుతున్నారు. మోడీకి అత్యంత స‌న్నిహితుడైన బీజేపీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా కార్య‌క్ర‌మాల‌న్నింటిని పోస్ట్ పోన్ చేసి మ‌రీ.. కేబినెట్ కూర్పుపై విస్తృతంగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్లుగా చెబుతున్నారు.

కేబినెట్ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌కు ముహుర్తం ద‌గ్గ‌ర ప‌డింద‌ని.. వ‌చ్చే నెల 3 నుంచి మోడీ ఫారిన్ టూర్ ఉన్న నేప‌థ్యంలో.. అంత‌కు ముందే కొత్త కేబినెట్ ను కొలువు తీర్చి వెళ‌తార‌ని చెబుతున్నారు. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌పై ఇటీవ‌ల కాలంలో అమిత్ షాతో త‌ర‌చూ భేటీ అవుతున్న ప్ర‌ధాని మోడీ.. తాజాగా మ‌రోసారి భేటీ అయ్యారు. తాజాగా బ‌య‌ట‌కు వ‌స్తున్న స‌మాచారం ప్ర‌కారం.. కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వ‌రాజ్ ను మంత్రి వ‌ర్గం నుంచి ప‌క్క‌కు పెట్టాల‌న్న నిర్ణ‌యాన్ని వాయిదా వేసుకున్న‌ట్లు చెబుతున్నారు.

ఇటీవ‌ల కాలంలో ఆమె అనారోగ్యానికి గురి కావ‌టంతో ఆమెకు విశ్రాంతిని ఇవ్వాల‌ని భావించిన‌ట్లుగా చెబుతున్నారు. అయితే.. తాజాగా ప్ర‌ధాని మోడీని కలిసిన సుష్మా.. తాను ఫిట్ గా ఉన్నాన‌ని.. ఆరోగ్య‌ప‌రంగా త‌న‌కు ఎలాంటి స‌మ‌స్య‌లు లేవ‌ని స్ప‌ష్టం చేసిన‌ట్లు చెబుతున్నారు. దీంతో సంతృప్తి చెందిన మోడీ సుష్మ‌ను కేబినెట్ నుంచి త‌ప్పించాల‌న్న నిర్ణ‌యాన్ని వాయిదా వేసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. ముందుగా అనుకున్న దాని ప్ర‌కారం సుష్మ స్థానంలో సంఘ్ రాం మాధ‌వ్ ను తీసుకోవాల‌ని భావించిన‌ట్లుగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి కొంద‌రిని ఢిల్లీకి తీసుకురావాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న మోడీ.. షాల ద్వ‌యం తాజాగా మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ పై దృష్టి పెట్టాల‌ని నిర్ణ‌యించిన‌ట్లుగా తెలుస్తోంది. ఇందుకు దేవేంద్ర సైతం ఓకే చెప్పారంటున్నారు. అన్ని అనుకున్న‌ట్లే జ‌రిగితే గ‌తంలో గోవా ముఖ్య‌మంత్రిగా ఉన్న మ‌నోహ‌ర్ పారీక‌ర్ ను కేంద్రానికి తీసుకెళ్ల‌టం తెలిసిందే. ఇప్పుడు దేవేంద్ర విష‌యంలో అదే జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తోంది. మ‌రి.. ఆయ‌న ఢిల్లీకి వెళితే మ‌హారాష్ట్ర సీఎం సీటు ఖాళీ కానుంది. దీన్ని చంద్ర‌కాంత్ పాటిల్ తో భ‌ర్తీ చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

ఈసారి విస్త‌ర‌ణ‌లో ఎన్సీపీ కూడా చోటు ద‌క్కించుకుంటుంద‌ని తెలుస్తోంది. ఎన్సీపీ నేత‌ల‌తో బీజేపీ నేత‌ల చ‌ర్చ‌లు చివ‌రిద‌శ‌కు చేరుకున్నాయ‌ని.. ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ కుమార్తె సుప్రియా సూలే లేదంటే కేంద్ర మాజీ మంత్రి ప్ర‌పుల్ ప‌టేల్ లో ఎవ‌రో ఒక‌రు కేంద్ర కేబినెట్ లో చేరే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ఇక‌.. యూపీ రైలు ప్ర‌మాదాల‌కు బాధ్య‌త వ‌హిస్తూ రాజీనామా చేసేందుకు సిద్ధ‌మైన రైల్వే మంత్రి సురేశ్ ప్ర‌భు స్థానంలో తృణ‌మూల్ ఎంపీ దినేశ్ త్రివేదిని రైల్వే మంత్రిని చేయ‌నున్న‌ట్లుగా చెబుతున్నారు. అవ‌స‌ర‌మైతే.. దినేశ్ టీఎంసీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ఇలా..కొత్త కొత్త మార్పుల‌తో కేబినెట్ విస్త‌ర‌ణ కార్య‌క్ర‌మంపై ప్లానింగ్ జ‌రుగుతున్న‌ట్లు చెబుతున్నారు. మ‌రి.. బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈ వివ‌రాల‌తో ఎన్ని అంశాలు మోడీ ఫైన‌ల్ చేసే అంశాల్లో ఎన్ని మ్యాచ్ అవుతాయో చూడాలి.