Begin typing your search above and press return to search.

మహారాష్ట్ర సీఎం బాటలో చంద్రుళ్లు నడవాలి

By:  Tupaki Desk   |   14 Nov 2016 5:20 PM GMT
మహారాష్ట్ర సీఎం బాటలో చంద్రుళ్లు నడవాలి
X
పెద్దనోట్ల రద్దుపై ప్రధానమంత్రి మోడీ తీసుకున్న సంచలన నిర్ణయం నేపథ్యంలో పలురాష్ట్రాలు.. రాష్ట్ర సర్కారు కిమ్మనకుండా ఉండిపోయాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తమకు సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నాయి. కేంద్రం నిర్ణయం తీసుకున్నా.. దాని కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న విషయానికి రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వటం లేదన్న విమర్శ వినిపిస్తోంది. పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న సంచలన నిర్ణయం కారణంగా కొంత ఇబ్బంది ఎదురు కావటం.. తమకు ముందస్తుగా ఎలాంటి సమాచారాన్న ఇవ్వకుండా ప్రధాని నిర్ణయం తీసుకోవటంపై పలువురు ముఖ్యమంత్రులు గుస్సాగా ఉన్న విషయం తెలిసిందే.

దీంతో.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. తమకు సంబంధం లేనట్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నయి. అయితే.. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కేంద్రం తీసుకున్నా.. రాష్ట్రాలు తమకుతాముగా కలుగజేసుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవటం ద్వారా ప్రజలకు ఉపశమనం కలుగుతుందని చెప్పొచ్చు. దీనికి ఉదాహరణగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీసుకున్న నిర్ణయాల్ని ప్రస్తావించాల్సిన అవసరం ఉంది.

మహారాష్ట్ర సర్కారుకు చెందిన బస్సుల్లో 50 కేజీల కూరగాయల్ని ఉచితంగా తీసుకెళ్లొచ్చని పేర్కొన్నారు. ఈ నెల 24 వరకు కూరగాయలు రవాణా చేసే రైతుల నుంచి కండక్టర్లు టికెట్ వసూలుచేయరని ప్రభుత్వం ప్రకటించింది. అదే సమయంలో ఈ నెల 18 వరకు టోల్ ట్యాక్స్ లు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారు. అంతేకాదు.. బోర్డర్ చెక్ పోస్టులు నుంచి కూడా మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి విద్యార్థులు చెల్లించాల్సిన ట్యూషన్ ఫీజ్.. ఎగ్జామ్ ఫీజుల్ని పే ఆర్డర్లు.. చెక్కుల రూపంలో తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. ఇదే రీతిలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించి.. ప్రజలు ఇబ్బంది కలుగకుండా ఉండేలా ఇద్దరు చంద్రుళ్లు వరుస నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/