Begin typing your search above and press return to search.

నాలుగు చ‌ట్ట‌ స‌భ‌ల్లో న‌లుగురు.. దేవెగౌడ కుటుంబ రికార్డు

By:  Tupaki Desk   |   15 Dec 2021 12:31 PM GMT
నాలుగు చ‌ట్ట‌ స‌భ‌ల్లో న‌లుగురు..  దేవెగౌడ కుటుంబ రికార్డు
X
ఓ కుటుంబం నుంచి ఒక‌రి కంటే ఎక్కువ మంది రాజ‌కీయ నాయ‌కులు ఉండ‌డం చూసే ఉంటారు. ఒకే కుటుంబం అయిన‌ప్ప‌టికీ వివిధ కార‌ణాల‌తో వేర్వేరు పార్టీల్లో కొన‌సాగుతున్న వాళ్లూ ఉన్నారు. అలా ఒకే కుటుంబానికి చెందిన నాయ‌కులు వివిధ ప‌ద‌వుల్లోనూ ఉన్నారు. కానీ ఒకేసారి ఒకే ఫ్యామిలీకి చెందిన న‌లుగురు.. నాలుగు చ‌ట్ట‌స‌భ‌ల్లో ప్రాతినిథ్యం వ‌హించ‌డం మాత్రం అరుదు. అలాంటి రికార్డును ఇప్పుడు మాజీ ప్ర‌ధాని హెచ్‌డీ దేవెగౌడ కుటుంబం అందుకుంది. ఆయ‌న ఫ్యామిలీ నుంచి ఇప్పుడు న‌లుగురు రాజ్య‌స‌భ‌, లోక్‌స‌భ‌, శాస‌న‌స‌భ‌, శాస‌న మండ‌లిలో స‌భ్యులుగా ఉన్నారు.

జ‌న‌తాద‌ళ్ అధినేత మాజీ ప్ర‌ధాని దేవెగౌడ కుటుంబం దేశ రాజకీయాల్లోనే ఎప్ప‌టికీ నిలిచిపోయే అరుదైన ఘ‌న‌త సొంతం చేసుకుంది. పార్ల‌మెంట్‌తో పాటు క‌ర్ణాట‌క ఉభ‌య స‌భ‌ల్లో ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కుటుంబంగా రికార్డు ఖాతాలో వేసుకుంది. తాజాగా వెలువ‌డిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో దేవెగౌడ మ‌న‌వ‌డు సూర‌జ్ రేవ‌ణ్ణ గెల‌వ‌డంతో ఈ రికార్డు సాధ్య‌మైంది. ప్ర‌స్తుతం దేవెగౌడ రాజ్య‌స‌భ సభ్యునిగా ఉన్నారు. ఆయ‌న చిన్న కుమారుడు హెచ్‌డీ కుమార‌స్వామి చెన్న‌ప‌ట్నం ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. ఇక దేవెగౌడ పెద్ద త‌న‌యుడు హెచ్‌డీ రేవ‌ణ్ణ వార‌సుడు సూర‌జ్ ఇప్పుడు విధాన ప‌రిష‌త్తుకు ఎన్నిక‌య్యాడు. మ‌రోవైపు సూర‌జ్ సోద‌రుడు ప్ర‌జ్వ‌ల్ లోక్‌స‌భ స‌భ్యుడిగా ఉన్నారు. ఇలా ఒకేసారి ఒకే కుటుంబం నుంచి న‌లుగురు నాలుగు చ‌ట్ట‌స‌భ‌ల్లో కొన‌సాగ‌నున్నారు.

మ‌రోవైపు రేవ‌ణ్ణ కూడా ప్ర‌స్తుతం హొలెన‌ర్సిపుర ఎమ్మెల్యేగా ఉన్నారు. సూర‌జ్ త‌ల్లి భ‌వాని జిల్లా ప‌రిష‌త్ స‌భ్యురాలు. ఇక కుమార స్వామి స‌తీమ‌ణి అనిత రామ‌న‌గ‌ర ఎమ్మెల్యేగా సేవ‌లందిస్తున్నారు. వీళ్ల త‌న‌యుడు నిఖిల్ జేడీఎస్ యూత్ వింగ్ అధ్య‌క్షునిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నాడు. మొత్తానికి ఒకే కుటుంబం నుంచి ఇప్పుడు ఓ రాజ్య‌సభ స‌భ్యుడు, లోక్‌స‌భ ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ, ఓ జిల్లా ప‌రిష‌త్ స‌భ్యురాలు ఉన్నారు. ఇది కేవ‌లం దేవెగౌడ కుటుంబానికి మాత్ర‌మే సాధ్య‌మైంది.