Begin typing your search above and press return to search.

దేవెగౌడ త్వరలో చనిపోతున్నారు.. ఆడియో కలకలం

By:  Tupaki Desk   |   14 Feb 2019 8:35 AM GMT
దేవెగౌడ త్వరలో చనిపోతున్నారు.. ఆడియో కలకలం
X
కర్ణాటకలో తృటిలో అధికారం కోల్పోయి ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ వచ్చే సార్వత్రిక ఎన్నికల లోపు ఎలాగైనా సరే జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి కర్ణాటకలో అధికారం చేపట్టాలని ప్రలోభాలకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అధికారం కోసం వారు చేస్తున్న చర్యలు లీక్ అయ్యి బీజేపీని అభాసుపాలు చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితమే కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప.. జేడీఎస్ ఎమ్మెల్యే కుమారుడిని ప్రలోభపెట్టేలా మాట్లాడిన ఆడియో ఒకటి సీఎం కుమారస్వామి విడుదల చేసి కలకలం రేపారు. ఈ ఆడియోతో బీజేపీ కుట్రలు - కుతంత్రాలు బయటపడ్డాయి.

తాజాగా బీజేపీ ఎమ్మెల్యేకు చెందిన మరో ఆడియో క్లిప్ లీక్ అయ్యింది. ఆ ఎమ్మెల్యే మాజీ ప్రధాని, జేడీఎస్ వ్యవస్థాపకుడైన దేవెగౌడ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఆడియో క్లిప్ లో ‘దేవెగౌడ త్వరలో చనిపోబోతున్నారు. కుమారస్వామి అనారోగ్యంతో ఉన్నాడు.. జేడీఎస్ లో ఒక అద్భుతం జరగబోతోంది చూడు’ అంటూ మాట్లాడిన మాటలు దుమారం రేపుతున్నాయి.

కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లా కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ప్రీతమ్ గౌడ ఈ వ్యాఖ్యలు చేసినట్టు స్పష్టమైంది. ఈ వ్యాఖ్యలు బయటకు రాగానే జేడీఎస్ కార్యకర్తలు నాయకులు సదురు బీజేపీ ఎమ్మెల్యే ప్రీతమ్ గౌడపై ఆయన ఇంటికి వెళ్లి మరీ దాడికి పాల్పడ్డారు. పోలీసులు చేరుకొని జేడీఎస్ కార్యకర్తలను చెదరగొట్టి ప్రీతమ్ గౌడ ఇంటికి పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.

తమ ఎమ్మెల్యేపై దాడిని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప ఖండించాడు. బీజేపీకి వ్యతిరేకంగా కుమారస్వామి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని.. అభాసుపాలు చేయాలని చూస్తోందని ఆరోపించారు. దీనికి నిరసనగా తాను హసన్ వెళ్లి ప్రతీమ్ గౌడ్ ఇంటిఎదుట ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. ఇలా సార్వత్రిక ఎన్నికలకు ముందే.. ఎండాకాలం వేడి తగలకముందే కర్ణాటకలో జేడీఎస్, బీజేపీ ఫైట్ సెగలు పుట్టిస్తోంది.