Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఫ్రంట్ కు దేవేగౌడ కొత్త పేరు పెట్టేశారు!

By:  Tupaki Desk   |   13 April 2018 11:07 AM GMT
కేసీఆర్ ఫ్రంట్ కు దేవేగౌడ కొత్త పేరు పెట్టేశారు!
X
టీఆర్ ఎస్ అధినేత‌ - తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు జాతీయ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేస్తూ ప్ర‌క‌టించిన ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ దాదాపుగా స్పీడందుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ప‌శ్చిమ బెంగాల్ రాజ‌ధాని కోల్ క‌తా వెళ్లిన కేసీఆర్‌... ఆ రాష్ట్ర సీఎం - జాతీయ రాజ‌కీయాల్లో స‌త్తా క‌లిగిన పార్టీగా పేరున్న తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీతో భేటీ నిర్వ‌హించిన కేసీఆర్‌... తాజాగా క‌న్న‌డ నాట కూడా అడుగుపెట్టేశారు. పార్టీలోకి కొంద‌రు సీనియ‌ర్లు - ద‌క్షిణాది భాషా చిత్రాల న‌టుడు ప్ర‌కాశ్ రాజ్‌ ను వెంటేసుకుని నేటి ఉద‌యం హైద‌రాబాదులో ఫ్లైటెక్కిన కేసీఆర్‌... నేరుగా బెంగ‌ళూరులో ల్యాండ‌య్యారు. బెంగ‌ళూరులో కాలుమోపిన మ‌రుక్ష‌ణ‌మే నేరుగా మాజీ ప్ర‌ధాని - జేడీఎస్ అధినేత హెఛ్‌ డీ దేవేగౌడ ఇంటిలో వాలిపోయిన కేసీఆర్‌... దేవేగౌడ‌తో పాటు ఆయ‌న కుమారుడు - క‌ర్ణాట‌క మాజీ సీఎం కుమారస్వామితో చ‌ర్చ‌లు జ‌రిపారు.

ఆ త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చిన కేసీఆర్ తాను ప్రారంభించద‌ల‌చుకున్న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కు సంబంధించి మునుప‌టి కంటే కూడా కాస్తంత క్లియ‌ర్‌గానే మాట్లాడారు. ఇక హైద‌రాబాదు నుంచి త‌న ఇంటికి వ‌చ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్ వెంట బ‌య‌ట‌కు వ‌చ్చిన మాజీ ప్ర‌ధాని దేవేగౌడ కూడా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. కేసీఆర్ ఆధ్వ‌ర్యంలో ప్రారంభ‌మ‌య్యే ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌ కు త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని గౌడ ప్ర‌క‌టించేశారు. అంతేకాకుండా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కు సంబంధించి గౌడ చాలా కీల‌క వ్యాఖ్య‌లే చేశార‌ని చెప్పాలి. కేసీఆర్ ఆధ్వ‌ర్యంలో పురుడుపోసుకుంటున్న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్... ఎవ‌రినో గ‌ద్దె దించ‌డానికి మాత్రం ఏర్పాటు చేస్తున్న‌ది కాద‌ని పేర్కొన్నారు. అంతేకాకుండా కేసీఆర్ స్టెప్‌ను డేరింగ్ స్టెప్‌గా అభివ‌ర్ణించిన గౌడ‌... 70 ఏళ్లుగా దేశం ఎదుర్కొంటోన్న సమస్యల పరిష్కారానికి కేసీఆర్ ముందడుగు వేశారని, ఈ నేప‌థ్యంలోనే తాము కేసీఆర్ ఫ్రంట్‌కు మ‌ద్ద‌తుగా నిల‌వ‌నున్నామ‌ని ప్ర‌క‌టించేశారు.

అయినా కేసీఆర్ ప్రారంభించ‌ద‌ల‌చుకున్న‌ది ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఎంత‌మాత్రం కాద‌ని, అది పీపుల్స్‌ ఫ్రంట్ అని దేవేగౌడ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. పీపుల్ ఫ్రంట్‌ మూడో ఫ్రంట్‌ - నాలుగో ఫ్రంట్ కాదని చెప్పిన గౌడ‌... అది పథకాల ఆధారిత ఫ్రంట్ అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కేసీఆర్ అమలు చేస్తోన్న పథకాలను తాము తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేరుస్తామని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తరువాత కేసీఆర్ వినూత్నమైన పథకాలు అమలు చేస్తున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి చ‌క్క‌టి కార్యక్రమం చేపట్టారని కేసీఆర్‌ను దేవేగౌడ ప్రశంసించారు. మొత్తంగా దేవేగౌద వ్యాఖ్య‌ల‌తో కేసీఆర్‌లో కొత్త ఉత్సాహ‌మే నిండింద‌ని చెప్ప‌క త‌ప్ప‌ద‌న్న వాద‌న వినిపిస్తోంది.