Begin typing your search above and press return to search.

వావ్ సెంటిమెంట్‌..నాన్న‌..ఇద్ద‌రు కొడుకులు!

By:  Tupaki Desk   |   20 May 2018 7:37 AM GMT
వావ్ సెంటిమెంట్‌..నాన్న‌..ఇద్ద‌రు కొడుకులు!
X
క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ముందు జేడీఎస్ పార్టీని లెక్క‌లోకి వేసుకున్నోళ్లు లేరు. కొంద‌రు రాజ‌కీయ విశ్లేష‌కులు మాత్రం జేడీఎస్ కీల‌కంగా మారుతుంద‌న్న అంచ‌నాలు వేశారు. ఎవ‌రికి సంపూర్ణ మెజార్టీ రాని నేప‌థ్యంలో జేడీఎస్ రోల్ కీ అవుతుంద‌న్న మాట నిజ‌మే అయ్యింది. అంత‌వ‌ర‌కూ వోకే. టుమ్రీ లాంటి జేడీఎస్ ఎమ్మెల్యేలు ఎవ‌రూ గీత దాట‌టానికి సాహ‌సించ‌లేదు ఎందుకు? మ‌హా మ‌హా కొమ్ములు తిరిగిన పార్టీల్లోనే జంప్ జిలానీలు ఉన్న వేళ‌.. అందుకు భిన్నమైన దృశ్యం జేడీఎస్ లో ఆవిష్కృత‌మైంది ఎందుకు? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం వెతికితే ఆస‌క్తిక‌ర అంశాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి.

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌కు ముందు మాజీ ప్ర‌ధాని దేవెగౌడ మాట‌లు గుర్తున్నాయా? దుష్ట‌.. దుర్మార్గ బీజేపీ వైపు వెళితే.. నా కొడుకైనా క‌డిగేస్తా? ద‌గ్గ‌ర‌కు కూడా రానివ్వ‌ను... పార్టీలో చోటుండ‌దంటూ వృద్ధ సింహం గ‌ర్జించింది. ఇలా మాట్లాడిన దేవెగౌడ‌.. త‌ర్వాతి కాలంలో ఇవే నా చివ‌రి ఎన్నిక‌లు.. నా కొడుకును ముఖ్య‌మంత్రిగా చూడాల‌నుకుంటున్నా.. అన్న మాట పెద్దాయ‌న నోటి నుంచి వ‌చ్చేస‌రికి జేడీఎస్ ఎమ్మెల్యేలు క‌రిగిపోయారు.

లాజిక్ గా చూసినా.. పెద్దాయ‌న చెప్పిన మాట‌ల్లో నిజం ఉండ‌టం.. కాలం.. క‌ర్మం క‌లిసి వ‌స్తే అధికారం త‌మ‌దే.. అన్నింటికి మించి 38 మంది ఎమ్మెల్యేల్లో ఎక్కువ మందికి మంత్రి ప‌ద‌వులు.. ఇలాంటి బంప‌ర్ ఆఫ‌ర్ ఎప్పుడో కానీ రానిది. అందుకే.. వారు గోడ దూక‌టానికి ఇష్ట‌ప‌డ‌లేదు. అంతేకాదు.. బీజేపీతో అంట‌కాగితే త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తు మ‌టాష్ కావ‌టం ఖాయ‌మ‌న్నది కూడా అర్థం కావ‌టంతో జేడీఎస్ నేత‌లు తొంద‌ర‌ప‌డ‌లేదు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. కుమార‌స్వామి కోసం దేవెగౌడ‌.. త‌న తండ్రి మాట‌ను మీర‌నంటూ కుమార‌స్వామి చేసిన వ్యాఖ్య‌లు కూడా జేడీఎస్ నేత‌ల్లో మ‌రింత క‌మిట్ మెంట్ పెంచేలా చేసింది. మ‌ధ్య‌లో దేవెగౌడ పెద్ద కుమారుడు రేవ‌ణ్ణ తిరుగుబాటు బావుటా ఎగురువేస్తారంటూ బీజేపీ లీకులు ఇచ్చినా.. టైం చూసి మ‌రీ టైట్ చేశారు దేవెగౌడ‌. దీంతో.. ఆయ‌న కూడా తొంద‌ర‌ప‌డ‌లేదు. త‌న తండ్రి ప‌రువును బ‌జారుకు ఈడ్చే సాహ‌సం చేయ‌లేదు.

బీజేపీకి వ‌చ్చే బోడి డిప్యూటీ సీఎం ప‌ద‌వితో పోలిస్తే.. త‌న సోద‌రుడు సీఎం కావ‌టం.. తాను ఆ ప్ర‌భుత్వంలో కీల‌కం అవుతున్న‌న్న పాయింట్ ఆయ‌న్ను ముందుకు అడుగు వేయ‌కుండా చేసింద‌ని చెప్పాలి. కొడుకుల్ని కంట్రోల్ చేయ‌లేని పెద్ద‌మ‌నిషి.. ఇంకేం చేయ‌గ‌ల‌ర‌న్న ప్ర‌శ్న త‌లెత్తే నేప‌థ్యంలో.. పార్టీ చీలిక‌కు ప్లాన్ చేస్తున్నారంటూ బీజేపీ నేత‌లు రేవ‌ణ్ణ పేరును బ‌య‌ట‌కు తీసుకురావ‌టంతో జేడీఎస్ వ‌ర్గాలు అలెర్ట్ అయ్యాయి. క‌మ‌ల‌నాథుల వాద‌న త‌ప్ప‌న్న విష‌యాన్ని తేల్చేయ‌ట‌మే కాదు.. త‌న ఇద్ద‌రు కొడుకులు త‌న ద‌గ్గ‌రే ఉన్న‌ట్లుగా దేవెగౌడ త‌న చేత‌ల్లో చేసి చూపించారు.

పార్టీ చీల్చే ఆరోప‌ణ‌లు వ‌చ్చిన రేవ‌ణ్ణ‌ను త‌న ద‌గ్గ‌ర ఉంచుకున్నారు దేవెగౌడ‌. మ‌రోవైపు.. జేడీఎస్ ఎమ్మెల్యేలు జారి పోకుండా ఉండేలా కుమార‌స్వామి క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకున్నారు. కొడుకు సెంటిమెంట్‌ను దేవెగౌడ తెర మీద‌కు తెస్తే.. తండ్రి సెంటిమెంట్ ను కొడుకు ప్ర‌స్తావించ‌టం క‌నిపిస్తుంది. గ‌తంలో బీజేపీతో జ‌ట్టు క‌ట్టి త‌ప్పు చేశాన‌ని.. ఇక‌పై ఆ ప‌ని చేసేదే లేద‌న్న విష‌యాన్ని స్ప‌ష్టంగా చెప్పారు కుమార‌స్వామి.

ఇలా.. తండ్రీ.. కొడుకులు ఇద్ద‌రూ.. ఎవ‌రి స్థాయిలో వారు సెంటిమెంట్‌ను పండించ‌టం జేడీఎస్ లో ఒక‌లాంటి భావోద్వేగం క‌నిపించింది. ఎక్క‌డిదాకానో ఎందుకు.. క్యాంపులో భాగంగా హైద‌రాబాద్ నోవాటెల్‌కు వ‌చ్చిన జేడీఎస్ ఎమ్మెల్యేలు.. ఒక‌రికొక‌రు కాపలా అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించారు.

ఇక్క‌డి క్యాంప్ లో జేడీఎస్ నేత‌లంతా ఒక క‌ట్టుగా అన్న‌ట్లు ఉన్నారు. ఎక్క‌డికి వెళ్లాల‌న్నా ఒక్క‌రు కాకుండా నలుగురైదుగురు క‌లిసి వెళ్ల‌టం ఒక‌టైతే.. త‌మ నాయ‌కుడు కుమార‌స్వామి కాబోయే ముఖ్య‌మంత్రి అని న‌మ్మ‌కంగా చెప్పారు. చూడండి.. మ‌రో 24 గంట‌ల త‌ర్వాత క‌ర్నాట‌క‌కు కాబోయే సీఎం మా నాయ‌కుడు. మేం గొప్ప‌లు చెప్ప‌టం లేదు. జ‌రిగేది చెబుతున్నామంటూ ప‌లువురు జేడీఎస్ నేత‌లు కాన్ఫిడెంట్ గా చెబుతున్న మాట‌ల్లో నిజం ఎంత‌న్న‌ది శ‌నివారం సాయంత్రం చోటు చేసుకున్న ప‌రిణామాలు నిరూపించాయి. మొత్తంగా చూసిన‌ప్పుడు.. కాంగ్రెస్‌ తో పోలిస్తే జేడీఎస్ లో సెంటిమెంట్ బాగా వ‌ర్క్ వుట్ అయిన‌ట్లే చెప్పాలి. కాంగ్రెస్ లో ఎమ్మెల్యేల మీద ప‌లు సందేహాలు వ్య‌క్తం కావ‌టం మ‌ర్చిపోకూడ‌దు. అదే స‌మ‌యంలో జేడీఎస్ లో అలాంటిది ఎక్క‌డా క‌నిపించ‌లేదు. సెంటిమెంట్ పుణ్య‌మా అని జేడీఎస్ చెదిరిపోకుండా చేసింది. అదే.. చివ‌రి వ‌ర‌కూ కుమార‌స్వామిని సీఎంను చేస్తుంద‌ని చెప్పాలి.