Begin typing your search above and press return to search.

మోడీ స్నేహ‌హ‌స్తానికి దేవ‌గౌడ నో

By:  Tupaki Desk   |   3 May 2018 8:03 AM GMT
మోడీ స్నేహ‌హ‌స్తానికి దేవ‌గౌడ నో
X
క‌ర్ణాట‌క రాష్ట్ర ఎన్నిక‌ల రాజ‌కీయం అంతకంత‌కూ ర‌స‌కందాయంలో ప‌డుతోంది. ప్ర‌ధాన పార్టీల‌న్నింటికి తాజా ఎన్నిక‌లు జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌గా మార‌టంతో.. ఈ ఎన్నిక‌ల్ని అన్ని పార్టీలు ఏ చిన్న అవ‌కాశాన్ని మిస్ చేసుకోని ప‌రిస్థితి. ఇప్ప‌టివ‌ర‌కూ వెలువ‌డుతున్న అంచ‌నాలు బీజేపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయి. బీజేపీకి బ్యాక్ బోన్ గా ఉండే సంఘ్ సొంతంగా చేసుకున్న స‌ర్వేలోనూ బీజేపీకి 70 సీట్ల‌కు మించి రావ‌ని చెప్ప‌టంతో.. ఏం చేయాలో దిక్కుతోచ‌ని ప‌రిస్థితి. ఇక‌.. ఆశ‌ల‌న్నీ త‌మ మేజిక్ మ్యాన్ మోడీ మీద‌నే ఆశ‌లు పెట్టుకున్నారు.

ఇక‌.. కాంగ్రెస్ పార్టీది మ‌రోలాంటి స‌మ‌స్య‌. ఇప్పుడు వెలువడుతున్న అంచ‌నాల ప్ర‌కారం ఆ పార్టీకి మిగిలిన వారి కంటే ఎక్కువ సీట్ల‌లో గెలుస్తుంద‌న్న అంచ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్నా.. సొంతంగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌లేని ప‌రిస్థితి. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు అంత‌కంత‌కూ త‌గ్గిపోతున్న నేప‌థ్యంలో..కీల‌క‌మైన క‌ర్ణాట‌క‌లో ఓట‌మి చెందితే 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌పై పెట్టుకున్న ఆశ‌లు స‌గం నీరు కారిన‌ట్లే. దీంతో.. ఏం చేసైనా త‌మ అధికారాన్ని కాపాడుకోవాల‌న్న ఆలోచ‌న‌లో కాంగ్రెస్ ఉంది.

జేడీఎస్ ప‌రిస్థితి ఇంకోలా ఉంది. ఇప్ప‌టికి రెండుసార్లు ఓట‌మిపాలైన జేడీఎస్‌.. ఈసారి ఎన్నిక‌ల్లో కానీ ఓట‌మి చెందితే ఆ పార్టీ ముక్క‌లుచెక్క‌లు అయ్యే ప్ర‌మాదం పొంచి ఉంది. ఈ నేప‌థ్యంలో త‌మ ఆస్తిత్వాన్ని కాపాడుకోవ‌టం కోస‌మైనా.. ఈ ఎన్నిక‌ల్లో త‌మ బ‌లాన్ని ప్ర‌ద‌ర్శించాల‌ని భావిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు వ‌స్తున్న అంచ‌నా ప్ర‌కారం.. ఈసారి జేడీఎస్ కీల‌కంగా మారుతుంద‌ని.. సొంతంగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే స‌త్తా లేకున్నా.. అధికార‌ప‌క్షాన్ని నిర్ణ‌యించే స‌త్తా జేడీఎస్ కు ఉంటుంద‌ని చెబుతున్నారు. దీంతో.. దేవ‌గౌడ ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇదిలాఉంటే.. ఇప్ప‌టికే బీజేపీతో ర‌హ‌స్య ఒప్పందం జ‌రిగిపోయింద‌ని.. ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత బీజేపీకి మ‌ద్ద‌తు ఇచ్చేలా ముంద‌స్తుగా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా చెబుతున్నారు.

అయితే.. ఈ వాద‌న‌ను తీవ్రంగా కొట్టిపారేస్తున్నారు దేవ‌గౌడ‌. ఎన్నిక‌ల త‌ర్వాత త‌న కొడుకు కానీ బీజేపీ కు మ‌ద్ద‌తు ప‌లికితే ఆయ‌న్ను పార్టీ నుంచి త‌రిమేస్తాన‌ని భీక‌ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. క‌ర్ణాట‌క‌లో త‌న ప్ర‌చారాన్ని షురూ చేసిన ప్ర‌ధాని మోడీ.. దేవ‌గౌడను ఉద్దేశించి పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌ను రేపుతోంది. త‌న‌కు దేవ‌గౌడ అంటే చాలా గౌర‌వ‌మ‌ని.. ఆయ‌న ఎప్పుడు ఢిల్లీ వ‌చ్చినా ఎదురేగి స్వాగ‌తం ప‌లుకుతాన‌ని చెప్పటమే కాదు.. ఈ దేశంలో అత్యున్న‌త నేత‌ల్లో దేవెగౌడ ఒక‌రంటూ పొగడ్త‌ల వ‌ర్షం కురిపించ‌టం గ‌మ‌నార్హం.

ఎన్నిక‌ల వేళ‌.. త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిపై ఏ స్థాయిలో మోడీ విరుచుకుప‌డ‌తారో తెలిసిందే. అలాంటి ఆయ‌న విమ‌ర్శించ‌టం వ‌దిలేసి.. అదే ప‌నిగా పొగ‌డ‌టం చూస్తుంటే.. ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే బీజేపీ.. జేడీఎస్ మ‌ధ్య ర‌హ‌స్య ఒప్పందం జ‌రిగింద‌న్న మాట బ‌లంగా వినిపిస్తుంది. ఒప్పందం తాలుకూ వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌స్తే పోలింగ్ మీద ప్ర‌భావం ప‌డుతుంద‌న్న ఉద్దేశంతోనే దేవెగౌడ్ ఆచితూచి అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.

రెండు ద‌ఫాలుగా ఎదురైన ఓట‌మి నేప‌థ్యంలో.. మూడుద‌ఫా కూడా అధికారానికి దూరంగా ఉంటే పార్టీ ప‌రంగా జ‌రిగే న‌ష్టం దేవెగౌడ్ లాంటి నేత‌కు తెలియంది కాదు. అయితే.. కాంగ్రెస్‌తో జ‌త‌క‌డ‌తారా? బీజేపీతో జ‌త క‌డ‌తారా? అన్న‌ది సందేహంగా మారింది. మోడీ రాజ‌కీయ చ‌తుర‌త తెలిసిన వారంతా ఎన్నిక‌ల వేళ‌లోనే దేవెగౌడ‌ను పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తున్నారంటేనే.. ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎలా ఉంటాయ‌న్న విష‌యంపై మోడీకి అవ‌గాహ‌న వ‌చ్చి ఉంటుంద‌ని.. ముందుచూపుతోనే పొగిడేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. ఏమైనా జేడీఎస్ ను అమితంగా ఆరాధిస్తున్న మోడీ వైఖ‌రి దేవెగౌడ్ మ‌న‌సును ఎంత‌లా మారుస్తుంద‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.