Begin typing your search above and press return to search.

దేవరగట్టులో ‘కట్టెల కొట్లాట’ ఈ సారి ఉంటుందా! అసలు అక్కడ ఏం జరుగుతోంది?

By:  Tupaki Desk   |   25 Oct 2020 11:30 AM GMT
దేవరగట్టులో ‘కట్టెల కొట్లాట’ ఈ సారి ఉంటుందా! అసలు అక్కడ ఏం జరుగుతోంది?
X
దసరా వచ్చిందంటే తెలుగు ప్రజల చూపంతా కర్నూలు జిల్లా దేవరగట్టు వైపుకు మళ్లుతుంది. అందుకు కారణం కారణం దసరా పూర్తైన మర్నాడు అక్కడ బన్నీఉత్సవం (కట్టెల కొట్లాట) జరగడమే. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ కట్టెల కొట్లాట జరుగుతూనే ఉంది. రక్తం పారుతూనే ఉంది. అయితే ఈ కట్టెల కొట్లాటకు ఈ సారైనా బ్రేక్​ పడుతుందా? అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కరోనా కేసులు భారీగానే ఉన్నందునే ఇక్కడ బన్నీ వేడుక జరగకపోవచ్చని పలువురు భావిస్తున్నారు.

మరోవైపు దేవరగట్టులో పోలీసులు మోహరించారు. ఈ వేడుకను ఆపేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. అయితే పోలీసుల కళ్లుగప్పి కర్రలయుద్ధం మారుమోగుతుందా..? ఈ ఆదివారం అర్ధరాత్రి ఏం జరగబోతోంది? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.దసరా అంటేనే వేడుకలు, ఉత్సవాలు కానీ కర్నూలు జిల్లా దేవరగట్టు ప్రత్యేకతే వేరు.. అక్కడ తలకాయలు పగిలితేనే పండుగ జరినట్టు. విజయదశమి రోజు అక్కడ తలకాయలు పుచ్చకాయల్లా పగిలిపోతాయి. దేశమంతా విజయదశమి సంబరాల్లో ఉంటే… దేవరగట్టులో మాత్రం అక్కడి ప్రజలు కర్రల యుద్ధంలో బిజీగా ఉంటారు.
దసరా రోజున మాళ మల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవడానికి 11 గ్రామాల ప్రజలు పోటీ పడతారు. రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో కొట్టుకుంటారు. ఫలితంగా ఏటా ఈ ఉత్సవంలో కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా బన్నీ ఉత్సవాన్ని నిరాటంకంగా నిర్వహిస్తూనే ఉన్నారు. హింసాత్మకంగా మారే ఈ ఉత్సవాన్ని నిరోధించేందుకు పోలీస్ శాఖ కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తూనే ఉంది.

కొన్ని సంస్థలు కూడా ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినా ప్రయోజనం మాత్రం శూన్యం. దేవరగట్టులో కర్రల యుద్ధానికి ఈసారి బ్రేక్‌ వేయడానికి పోలీసులు గట్టి చర్యలే తీసుకుంటున్నారు. ఆంక్షలతోనైనా మాళ మల్లేశ్వరస్వామి ఉత్సవం జరగాల్సిందే అనేది స్థానికుల పట్టుదల..అందుకే పోలీస్ శాఖ విడతల వారీగా సమావేశాలు నిర్వహించినా..ప్రతి ఊరి నుంచి కొంతమందైనా వచ్చి కార్యక్రమం జరిపించుకుంటామని చెప్పారు. మాళ మల్లేశ్వర స్వామి ఏ ఊరికి తీసుకెళ్తే ఆ ఊరికి మంచి జరుగుతుందనే నమ్మకమే దీనికి కారణం. ఈ లాంటి టెన్షన్​ వాతావరణంలో ఆదివారం అర్ధరాత్రి ఏం జరుగబోతుందో వేచి చూడాలి.