Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ పెట్టినా కర్రల సమరం.. రక్తపాతం

By:  Tupaki Desk   |   27 Oct 2020 3:45 AM GMT
లాక్ డౌన్ పెట్టినా కర్రల సమరం.. రక్తపాతం
X
ఇప్పుడు కరోనా వైరస్ విస్తరిస్తున్న సమయం. పైగా పండుగలు వచ్చాయి. దీంతో సంప్రదాయాలు, పండుగల్లోనూ ఆంక్షలు విధించారు. దేవి నవరాత్రి ఉత్సవాలకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. ఇక గ్రామాల్లోని పలు ఉత్సవాల తంతుకు పోలీసులు బ్రేక్ వేశారు.

కానీ ఇన్ని కట్టుబాట్లు పెట్టినా కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరం ఆగలేదు. రక్తపాతం తగ్గలేదు. లాక్డౌన్, 144 సెక్షన్ పెట్టినా కూడా జనాలు వెనక్కి తగ్గలేదు. పోలీసుల ఆంక్షల్ని పట్టించుకోని స్థానికులు లక్ష వరకు బన్నీ ఉత్సవానికి హాజరయ్యారు.

దేవరగట్టులోని నెరినికి, సుళువాయి విరుపాపురం, అరికేరి, ఎల్లార్తి గ్రామాల వారు తాజాగా మాల మల్లేశ్వరస్వామి విగ్రహాన్ని దక్కించుకునేందుకు కర్రల సమరం చేశారు. ఈ దాడుల్లో 27మందికి గాయాలు కాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బన్నీ ఉత్సవం కరోనా కారణంగా రద్దు అవుతుందని అధికారులు తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటు చేయలేదు. దీంతో గాయపడిన వారికి చికిత్స అందలేదు.

ప్రతీ ఏడాది దసరా తర్వాత చేసే ఈ బన్నీ ఉత్సవం దేవరగట్టులో ఉద్రిక్తతలకు దారితీస్తుంది. ఉత్స వ విగ్రహం కోసం 34 గ్రామాలు కొట్టుకుంటాయి. దివిటీలు, కర్రలతో యుద్ధం చేస్తాయి. ఈ ఉత్సవంలో ఎంతో మంది తలలు పగులుతాయి. ప్రాణాలు పోతాయి. అయినా ఏళ్లుగా ఈ ఉత్సవం కొనసాగుతూనే వస్తోంది.

కరోనా కారణంగా ఈసారి ఉత్సవాన్ని రద్దు చేసి లాక్ డౌన్ పెట్టి 1000 మంది పోలీసులను మోహరించి 144 సెక్షన్ పెట్టినా జనాలు మాత్రం ఆదేశాలు బేఖారతు చేసి ఈ తంతు నిర్వహించారు. రక్తపాతం సృష్టించారు.