Begin typing your search above and press return to search.

వైఎస్‌ కు నివాళుల‌ర్పించిన జంపింగ్ ఎమ్మెల్సీ

By:  Tupaki Desk   |   9 July 2016 10:16 AM GMT
వైఎస్‌ కు నివాళుల‌ర్పించిన జంపింగ్ ఎమ్మెల్సీ
X
వైకాపా నుంచి ఎమ్మెల్సీగా ప్రాతినిథ్యం వ‌హిస్తూ.. ఇటీవ‌ల టీడీపీలోకి జంప్ చేసిన క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మడుగు ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి సైకిల్ పార్టీకి గ‌ట్టి షాకిచ్చారు. అంటే.. ఆయ‌న తిరిగి వైకాపా గూటిక వ‌చ్చేశార‌నికాదు! చంద్ర‌బాబుకు బ‌ద్ధ విరోధి - రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి 67వ జ‌యంతి సంద‌ర్భంగా శుక్ర‌వారం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో దేవ‌గుడి పాల్గొన‌డ‌మే కాకుండా వైఎస్ విగ్ర‌హానికి నిలువెత్తు దండ కూడా వేసి ద‌ణ్ణం పెట్టారు. దీనికి సంబంధించి టీడీపీలో తీవ్ర చ‌ర్చ‌లు సాగుతున్నాయి. నిన్న‌గాక మొన్న వైఎస్ జ‌గ‌న్ వైఖ‌రిని విభేదించి వైకాపాకు గుడ్‌ బై చెప్పిన నేత ప‌ట్టుమ‌ని ఆరు నెల‌లు కూడా తిర‌గ‌కుండానే తిరిగి జ‌గ‌న్‌ తండ్రి వైఎస్ కార్య‌క్ర‌మానికి దేవ‌గుడి ఎలా హాజ‌ర‌య్యాడా అని తెలుగు త‌మ్ముళ్లు విస్తు పోతున్నార‌ట.

అయితే, విశ్లేష‌కులు మాత్రం.. రాజ‌కీయాల్లో ఏనిమిషానికి ఏమైనా జ‌ర‌గ‌వ‌చ్చ‌ని - ఏ నిమిషానికి ఎవ‌రెలాగైనా మార‌వ‌చ్చ‌ని అంటున్నారు. ఇటీవ‌ల చంద్ర‌బాబు నేతృత్వంలో జ‌రిగిన నీరు-చెట్టు కార్య‌క్ర‌మంలో వైకాపా నేత ఒక‌రు పాల్గొన్నారు. అప్ప‌ట్లో ఈ వార్త రాష్ట్రంలో తీవ్ర సంచ‌ల‌నం సృష్టించింది. దీంతో ఆయ‌న టీడీపీలోకి చేరిపోతున్నార‌నే వాద‌న కూడా వ‌చ్చింది. అయితే, ఆయ‌న మాత్రం కార్య‌క్ర‌మం మంచిది కాబ‌ట్టి పాల్గొన్నాన‌ని బ‌దులిచ్చారు. అది ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మం. వైఎస్‌ ది వ్య‌క్తిగ‌త కార్య‌క్ర‌మం. దివంగత సీఎం వైఎస్ కుటుంబానికి మూడున్నర దశాబ్దాలుగా భక్తుడిగా ఉన్నారు దేవ‌గుడి నారాయ‌ణ‌రెడ్డి. వైఎస్ త‌న‌యుడు జ‌గ‌న్ వైకాపా స్థాపించ‌గానే ఆ పార్టీలోకి చేరి.. అత్యంత విధేయుడిగా ప‌నిచేశారు.

నారాయ‌ణ‌రెడ్డి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి గీసిన గీత ఎన్న‌డూ దాటలేదు. ఆదినారాయ‌ణ రెడ్డి జ‌గ‌న్‌ తో విభేదించి టీడీపీ సైకిలెక్కారు. దీంతో దేవ‌గుడి నారాయ‌ణ‌రెడ్డి కూడా ఆదినారాయ‌ణ బాట ప‌ట్టి చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకుని ప‌చ్చ‌కండువా క‌ప్పుకొన్నారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా శుక్ర‌వారం జ‌రిగిన వైఎస్ జ‌యంతి వేడుక‌లో దేవ‌గుడి తన సొంతూరు దేవగుడిలో వైఎస్ విగ్రహానికి ఘన నివాళి అర్పించారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆ సమయంలో అదే ఊరిలోని తన సొంతింటిలో ఉండగానే... దేవగుడి వైఎస్ కు నివాళి అర్పించ‌డం గ‌మ‌నార్హం. గతంలో వైకాపాలో ఉన్న సమయంలో మాదిరిగానే ఈ కార్యక్రమంలో దేవగుడి వైఎస్ కు ఘన నివాళి అర్పించేస‌రికి ఈ విషయంపై కడప జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నాయి.