Begin typing your search above and press return to search.

అమెరికా ఫ్రాడ్‌!..మ‌న విద్యార్థుల ఆవేద‌న ఇదే!

By:  Tupaki Desk   |   8 Feb 2019 5:11 PM GMT
అమెరికా ఫ్రాడ్‌!..మ‌న విద్యార్థుల ఆవేద‌న ఇదే!
X
అమెరికాలో అక్ర‌మ వ‌ల‌స‌దారుల ఆట‌లు క‌ట్టించేందుకు ఆ దేశ పోలీసులు సృష్టించిన న‌కిలీ వ‌ర్సిటీ ఫార్మింగ్ట‌న్ వ‌ర్సిటీలో చేరి నిలువుగా ద‌గాకు గురైన తెలుగు విద్యార్థులు... చేసేదేమీ లేక ఒక్కొక్క‌రుగా తిరిగి వ‌స్తున్నారు. ఇలా తిరిగి వ‌స్తున్న వారిలో కొంద‌రు గుట్టు చ‌ప్పుడు కాకుండా ఇళ్ల‌కు చేరుతుంటే... మ‌రికొందరు త‌మ ఆవేద‌న‌ను బ‌య‌ట‌కు చెబుతున్నారు. ఇంకొంద‌రు త‌మ ఆవేద‌న‌ను బ‌య‌ట‌కు వెళ్ల‌గ‌క్కుతూనే... త‌మ వివ‌రాల‌ను వెల్ల‌డించేందుకు మాత్రం వెనుకంజ వేస్తున్నారు. మొత్తంగా అమెరికా పోలీసులు విసిరిన వ‌ల‌కు చిక్కి త‌మ అమెరికా క‌ల పూర్తిగా నెర‌వేర‌లేద‌ని తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన మ‌న విద్యార్థుల ఆవేద‌న ఎలా ఉంద‌న్న విష‌యంపై ఓ వార్తా సంస్థ ఓ స‌మ‌గ్ర క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. ఈ క‌థ‌నం మేర‌కు ఫార్మింగ్ట‌న్ వ‌ర్సిటీ ఉచ్చులో చిక్కి త‌న క‌ల‌ను సాకారం చేసుకోలేక‌ - అక్క‌డే ఉండ‌లేక‌ - జ‌రిగిన మోసాన్ని ఇంటిలో చెప్పుకోలేక - త‌న అమెరికా క‌ల కోసం త‌న కుటుంబం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియ‌క‌ - త‌న పేరును వెల్ల‌డించ‌కుండానే త‌న మొత్తం బాధ‌ను ఓ విద్యార్థి వెల్ల‌డించాడు.

ఆ విద్యార్థి ఆవేద‌న ఎలా ఉందంటే.. 2013లో ఇంజినీరింగ్‌ ను పూర్తి చేసిన స‌ద‌రు విద్యార్థి అమెరికా కల‌ను సాకారం చేసేందుకు అత‌డి కుటుంబం ఏకంగా రూ.10ల‌క్ష‌లు అప్పు చేసింది. ఆ డ‌బ్బుతో 2014లోనే అమెరికాలో కాలుమోపిన సంద‌రు విద్యార్థి కాలిఫోర్నియాలోని నార్త్ వెస్ట‌ర్న్ పాలిటెక్నిక్ యూనివ‌ర్సిటీలో జాయిన్ అయ్యాడు. అక్క‌డ చ‌దువుకుంటూనే అక్క‌డే ఓ కంపెనీలో ఐటీ కాంట్రాక్ట‌ర్‌గా ప‌నిచేసేవాడు. రెండేళ్లు బండి సాఫీగానే సాగినా.. 2017లో అమెరికా ప్ర‌భుత్వం స‌ద‌రు వ‌ర్సిటీ గుర్తింపును ర‌ద్దు చేయ‌గా... ఆ విద్యార్థి ఉద్యోగం కోల్పోయాడు. అప్ప‌టిదాకా ఆ ఉద్యోగంతో నెల‌కు 4000 వేల డాల‌ర్లు సంపాదిస్తూ... నెల‌కు అయ్యే ఖ‌ర్చు 1,500 డాల‌ర్లు మిన‌హా మిగిలిన సొమ్మును ఆదా చేసుకుంటూ ఉండేవాడు. ఒక్క‌సారిగా ఉద్యోగం ఊడ‌టంతో అత‌డి ప‌రిస్థితి అగమ్య‌గోచ‌రంగా మారిపోయింది. ఈ క్రమంలో ఏం చేయాలో దిక్కుతోచ‌ని ప‌రిస్థితిలో ప‌డిపోయిన అత‌డికి మిత్రుల స‌ల‌హాతో ఫార్మింగ్ట‌న్ వ‌ర్సిటీ ఆప‌ద్భాంద‌వుడిగానే క‌నిపించింది. ముందూ వెనుకా చూసుకోకుండా దానిలో చేరిపోయాడు.

ఈ క్ర‌మంలోనే 2017లోనే హెచ్‌-1బీ వీసా కోసం కూడా ద‌రఖాస్తు చేసుకున్నాడు. వీసా ద‌క్కే ఛాన్సులు క‌నిపించినా.. మ‌రిన్ని వివ‌రాలు కావాల‌ని అమెరికా అధికారులు కోర‌డంతో ఆ వీసా కాస్తా అంద‌కుండా పోయింది. ఆ త‌ర్వాత ఫార్మింగ్ట‌న్ వ‌ర్సిటీ న‌కిలీద‌ని, ఆ వ‌ర్సిటీలో చేరిన విద్యార్థుల‌తో పాటు చేర్పించిన వారిని కూడా అమెరికా పోలీసులు అరెస్ట్ చేశార‌ని తెలియ‌డంతో అత‌డు హతాశుడే అయ్యాడు. ఈ స్టింగ్ ఆప‌రేష‌న్ బ‌య‌ట‌ప‌డ‌టంతో అక్క‌డే ఉండ‌లేక‌, ఇక్క‌డికి రాలేక అత‌డు న‌ర‌క యాత‌న అనుభ‌వించాడు. పోనీ త‌న భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకుని వెంట‌నే తిరిగి వ‌చ్చేద్దామంటే చేతిలో చిల్లిగ‌వ్వ కూడా లేదు. అయితే ఎలాగోలా స్నేమితులు కొంద‌రు డ‌బ్బు స‌ర్ద‌డంతో దానితోనే అత‌డు ఫ్లైట్ టికెట్లు కొన‌నుక్కుని స్వ‌దేశం చేరాడు. మ‌రి త‌న కోసం ఏకంగా 10 ల‌క్ష‌లు అప్పులు చేసి... త‌ను ప్ర‌యోజ‌కుడైతే క‌ష్టాల‌న్ని తొల‌గిపోయిన‌ట్టేన‌ని ధీమాతో ఉన్న కుటుంబ స‌భ్యుల‌కు ఈ విష‌యం ఎలా చెప్పాలో అత‌డికి అర్థం కాలేదు.

ఈ క్ర‌మంలో కుటుంబానికి నిజం చెప్పి వారిని ఇబ్బంది పెట్ట‌డానికి అత‌డు ఇష్ట‌ప‌డ‌లేదు. త‌న‌కు వీసా వ‌స్తుంద‌ని, కంపెనీ ప‌ని మీదే ఇక్క‌డికి వ‌చ్చాన‌ని కుటుంబానికి చెప్పిన అత‌డు... ఇప్పుడు ఇక్క‌డే మంచి ఉద్యోగం కోసం య‌త్నాలు ప్రారంభించారు. త‌న కుటంబంలో అమెరికాలో కాలు మోపిన తొలి వ్య‌క్తిగా అత‌డు అనుభ‌విస్తున్న మాన‌సిక ఒత్తిడి వ‌ర్ణ‌నాతీత‌మ‌నే చెప్పాలి. అమెరికాలో ఉన్నంత కాలం చాలా పొదుపుగా వ్య‌వ‌హ‌రించిన అత‌డు.. ఇప్ప‌టికే త‌న కోసం కుటంబం చేసిన అప్పులో ఇప్ప‌టికే రూ.4 ల‌క్ష‌లు తీర్చేశాడ‌ట‌. ఇంకా రూ.6 ల‌క్ష‌ల అప్పు, దానిపై వ‌డ్డీ ఎలా చెల్లించాల‌న్న‌దే ఇప్పుడు అత‌డి ముందున్న అస‌లు సిసలు ప్ర‌శ్న‌. ఇదీ స్థూలంగా ఆ విద్యార్థి ఆవేద‌న‌. ఇక అక్క‌డికి వెళ్లి... పార్మింగ్ట‌న్ ఉచ్చులో ప‌డిన ప్ర‌తి విద్యార్థిదీ ఇదే త‌ర‌హా ఆవేద‌న‌నే అని చెప్ప‌క త‌ప్ప‌దేమో.