Begin typing your search above and press return to search.

ఏపీ కొత్త మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవేనా!?

By:  Tupaki Desk   |   11 April 2022 8:11 AM GMT
ఏపీ కొత్త మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవేనా!?
X
ఏపీలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. మొత్తం 25 మందితో కూడిన సభ్యుల జాబితాను ఆదివారం ప్రకటించారు. వీరిలో 11 మంది పాత మంత్రులు, 14 మంది కొత్త వారితో కొత్త కేబినెట్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే కొత్త కేబినెట్ లో సీనియారిటీ ఆధారంగా శాఖలు కేటాయించినట్లుగా తెలుస్తోంది. పాత మంత్రుల్లో కొందరికీ పాత శాఖలే కేటాయించనున్నట్టు ప్రచారం సాగుతోంది. గతంలో మాదిరిగానే ఎస్సీ మహిళకే హోంశాఖ అంటున్నారు. దీంతో తానేటి వనితకు ఈసారి హోంమంత్రి పదవి దక్కే చాన్స్ ఉందని వైసీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

మరోసారి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికే ఆర్థిక శాఖ అప్పగిస్తున్నారని టాక్ నడుస్తోంది. దాంతో ఐటీ శాఖ కూడా ఆయనకే ఇవ్వొచ్చని అంటున్నారు. ఇక ధర్మానకు రెవెన్యూ లేదా పంచాయితీరాజ్ శాఖ ఇవ్వొచ్చంటున్నారు. ఇక కాకాణికి వ్యవసాయం, ఫైర్ బ్రాండ్ రోజాకు పౌరసరఫరాల శాఖ ఇవ్వొచ్చని చెబుతున్నారు.

అంజాద్ పాషాకు మైనార్టీ వెల్ఫేర్, వేణుగోపాల కృష్ణకు బీసీ వెల్ఫేర్, సిదిరి అప్పలరాజుకు మత్స్యశాఖ, విశ్వరూప్ కు సోషల్ వెల్ఫేర్, పెద్దిరెడ్డికి విద్యుత్ , గనులు, అంబటి రాంబాబుకు సినిమాటోగ్రఫీ, బొత్స సత్యనారాయణకు మున్సిపల్ శాఖ, ఉషాశ్రీకి శిశు సంక్షేమ శాఖలు కేటాయించినట్టు సమాచారం.

గతంలో లాగానే ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కనున్నాయని తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు వర్గాలకు ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. మైనార్టీ నుంచి అంజాద్ బాషాకు డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉండగా.. ఎస్టీ వర్గం నుంచి పీడిక రాజన్న దొర కానున్నారు.

ఎస్సీ నుంచి నారాయణ స్వామి లేదా పినెపె విశ్వరూప్ లేదా వనిత కానున్నారు. బీసీ నుంచి ధర్మాన ప్రసాదరావు లేదా బొత్సకు చాన్స్ ఉండొచ్చని అంటున్నారు. కాపు సామాజికవర్గం నుంచి అంబటి రాంబాబు లేదా దాడిశెట్టి రాజాకు అవకాశం ఉన్నట్లు వినికిడి.

ఇక మంత్రి పదవి ఇన్నాళ్లు అనుభవించి ఇప్పుడు దక్కకపోవడంతో అసంతృప్తి జ్వాల ఎగిసిపడింది. ఇప్పటికే వైసీపీలో మొన్నటివరకూ హోంమంత్రిగా చేసిన మేకతోటి సుచరిత తాజాగా తనకు పదవి దక్కలేదని తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మరికొంత మంది మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకోగా.. ఇంకొందరు అభిమానులు రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నారు. దీంతో కొత్త కేబినెట్ తో జగన్ కు కొత్త తలనొప్పులు వచ్చాయని అంటున్నారు.