ఓవైపు కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గత ఏడాదిలో కేసుల తీవ్రతకు ఏ మాత్రం తీసిపోని రీతిలో.. కొన్ని రాష్ట్రాల్లో అయితే మరింత ఎక్కువగా కేసులు నమోదువుతున్నాయి. కరోనా కేసుల తీవ్రత పెరిగేకొద్దీ.. ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావాన్ని చూపే వీలుంది. ఇదిలా ఉంటే.. బంగారు దిగుమతుల మీద మాత్రం కరోనా ప్రభావం లేకపోగా.. మరింత ఎక్కువగా తెప్పించటం ఆసక్తికరంగా చెప్పాలి.
దేశీయ బంగారు సమాఖ్య లెక్కల ప్రకారం 160 టన్నుల బంగారాన్ని మార్చిలో దిగుమతి చేసుకున్నట్లుగా చెబుతున్నారు. గత ఏడాది మార్చితో పోలిస్తే ఇది 471 శాతం ఎక్కువని చెబుతున్నారు. లాక్ డౌన్ వేళలో.. లావాదేవీలన్ని స్తంభించిన పోయిన నేపథ్యంలో.. బంగారు దిగుమతి పరిమితంగానే సాగింది.ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడటంతో బంగారు దిగుమతులు మరింత పెరిగినట్లుగా చెబుతున్నారు.
లాక్ డౌన్ అనంతరం..అనూహ్యంగా బంగారం అమ్మకాలు బాగా పెరిగినట్లుగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. చాలా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ మందగించటం.. సురక్షితమైన పెట్టుబడికి.. పొదుపునకు బంగారమే మేలన్న భావన కూడా అమ్మకాల భారీగా సాగటానికి కారణంగా చెబుతున్నారు. విపత్తుకు ముందు నెల వారీగా 80 టన్నుల బంగారం దిగుమతి అవుతుంటే.. ఇప్పుడు మాత్రం మరింత పెరిగింది.
సెకండ్ వేవ్ పుణ్యమా అని కేసులు పెరుగుతున్న వేళలో బంగారం రికార్డు స్థాయిలో దిగుమతి కావటానికి కారణం ఏమిటన్న విషయంలోకి వెళితే.. ఏప్రిల్ లో వచ్చే అక్షయ త్రతీయకు బంగారం కొనే సెంటిమెంట్ కారణమని చెబుతున్నారు. గత ఏడాది లాక్ డౌన్ కారణంగా ఈ పర్వదినం రోజున బంగారం కొనలేని పరిస్థితి. ఈ ఏడాది అందుకు భిన్నమైన పరిస్థితులు ఉండటంతో బంగారం అమ్మకాలు జోరుగా సాగుతాయని అంచనా వేస్తున్నారు. దీనికి తోడు.. ధర కూడా అందుబాటులోకి రావటంతో.. భారీగా సేల్స్ ఉంటాయని చెబుతున్నారు. ఇదే.. బంగారం భారీగా దిగుమతికి కారణమన్న మాట మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.