Begin typing your search above and press return to search.

ఇందుకే నా కొడుకు ఉగ్ర‌వాది అయ్యాడు..దాడి చేశాడు

By:  Tupaki Desk   |   16 Feb 2019 4:37 PM GMT
ఇందుకే నా కొడుకు ఉగ్ర‌వాది అయ్యాడు..దాడి చేశాడు
X
ప్ర‌పంచ వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టించిన పుల్వామా దాడి గురించి మ‌రో కీల‌క ప‌రిణామం తెర‌మీద‌కు వ‌చ్చింది. బీతావ‌హ రీతిలో సాగిన ఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌ పై ఆత్మాహుతి దాడికి పాల్ప‌డిన జైషే ఉగ్ర‌వాది ఆదిల్ అహ్మ‌ద్ దార్ గురించి ఆయ‌న తండ్రి గులామ్ హ‌స‌న్ దార్ కీల‌క అంశాలు పంచుకున్నాడు. త‌న కుమారుడు ఎందుకు తిరుగుబాటు మార్గాన్ని ఎంచుకున్నాడో అతని తండ్రి వివ‌రించాడు. స్కూల్‌ విద్యార్థిగా ఉన్న స‌మ‌యంలో.. భ‌ద్ర‌తా ద‌ళాలు ఆదిల్ ముక్కును నేల‌కు రాసేలా చేశాయ‌ని, ఆ ఒక్క సంఘ‌ట‌న అత‌న్ని తీవ్ర‌వాదం వైపు మ‌ళ్లించిన‌ట్లు గులామ్ దార్ చెప్పాడు.

తాజా ఘ‌ట‌న నేప‌థ్యంలో - పేలుడు జ‌రిగిన కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఆదిల్ వీడియోను జైషే రిలీజ్ చేసింది. సూసైడ్ దాడికి పాల్ప‌డిన ఆదిల్‌ కు క‌క‌పోరా ప్రాంతంలో త‌ల్లిదండ్రులు అంత్య‌క్రియులు నిర్వ‌హించారు. తాజాగా ఓ మీడియా సంస్థ‌తో ఆదిల్ తండ్రి మాట్లాడుతూ ఓ రోజు స్కూల్ నుంచి ఇంటికి వ‌స్తుంటే పోలీసులు ఆదిల్‌ను ప‌ట్టుకున్నార‌ని - అత‌న్ని వేధించార‌ని - ముక్కును నేల‌కు రాయ‌మ‌ని.. వాహ‌నం చుట్టూ తిప్పించార‌ని గులామ్ గుర్తు చేశాడు. ఆ ఘ‌ట‌న‌ త‌ర్వాత ఆదిల్ పోలీసుల‌పై కోపాన్ని పెంచుకున్నాడ‌ని చెప్పాడు. ఆ సంఘ‌ట‌న‌ను అత‌ను ప‌దేప‌దే గుర్తు చేసుకుంటూ బాధ‌ప‌డేవాడ‌ని తెలిపాడు. పోలీసులు కొట్ట‌డం వ‌ల్లే వారిపై ఆదిల్‌కు కోపం పెరిగింద‌ని త‌ల్లి ఫ‌మీదా కూడా వెల్ల‌డించింది. స్కూల్‌ లో అత‌ను డ్రాపౌట్‌ గా మార‌డ‌ని పేర్కొంది. కాగా, ఆదిల్ గ‌త ఏడాది జైషేలో చేరాడు.

ఇదిలాఉండ‌గా, పుల్వామా దాడిని అఖిల ప‌క్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఇవాళ కేంద్ర హోంమంత్రి రాజ్‌ నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిల ప‌క్ష పార్టీ భేటీ జ‌రిగింది. పుల్వామా దాడిని ఖండిస్తున్న అఖిల ప‌క్షం ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. జ‌వాన్ల కుటుంబ‌స‌భ్యుల‌కు అండ‌గా ఉండాల‌ని తీర్మానించాయి. ఉగ్ర‌వాదాన్ని నిర్ద్వందంగా ఖండిస్తున్న‌ట్లు అఖిల‌ప‌క్ష పార్టీలు వెల్ల‌డించాయి. ఉగ్ర‌వాదంపై పోరాటానికి ఐక్యంగా నిలిచి ఉన్నామ‌ని అఖిల‌ప‌క్షం పేర్కొన్న‌ది. దేశ‌భ‌ద్ర‌త కోసం ప్ర‌భుత్వంతో క‌లిసి ఐక్యంగా నిలిచి ఉన్నామ‌ని కాంగ్రెస్ నేత గులామ్ న‌బీ ఆజాద్ అన్నారు. క‌శ్మీర్ అయినా లేక ఇత‌ర ప్రాంత‌మైనా, ఉగ్ర‌దాడిని ఖండిస్తున్నామ‌ని తెలిపారు. ఉగ్ర‌పోరాటంపై ప్ర‌భుత్వానికి కాంగ్రెస్ పూర్తి మ‌ద్ద‌తు ఇస్తుంద‌న్నారు. అన్ని జాతీయ‌, ప్రాంతీయ పార్టీల నేత‌ల‌తో ప్ర‌ధాని స‌మావేశం కావాల‌ని రాజ్‌నాథ్‌ను కోరిన‌ట్లు గులాం న‌బీ ఆజాద్ తెలిపారు. అన్ని పార్టీలు ఈ అభిప్రాయానికి మ‌ద్దుతు ఇచ్చాయ‌న్నారు. యావ‌త్ దేశం ఆగ్ర‌హంగా ఉంద‌న్నారు. దేశ ప్ర‌జ‌లంతా భ‌ద్ర‌తా ద‌ళాల‌కు అండ‌గా ఉన్నార‌న్నారు.