Begin typing your search above and press return to search.
భర్త వదిలేశాడని కేంద్ర మంత్రి సహాయం కోరింది
By: Tupaki Desk | 11 April 2017 1:28 PM GMTసోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సమస్యలపై వేగంగా స్పందించే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కు అనూహ్యమైన అభ్యర్థన ఒకటి వచ్చింది. తన భర్త అకారణంగా వదిలేశాడని, న్యాయం చేయాలని కోరుతూ సుష్మాకు ట్వీట్ చేసింది ఓ బాధితురాలు. తన భర్తను విదేశం నుంచి రప్పించి కఠిన శిక్ష విధించాలని, ఎన్నారై మోసగాళ్లకు కనువిప్పు కలిగించేలా ఉండాలని చాంద్ దీప్ కౌర్ అనే 29 ఏళ్ల యువతి కోరింది. దీనికి సుష్మా స్వరాజ్ స్పందించి న్యాయం చేయాలంటూ తన సిబ్బందిని ఆదేశించారు.
న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ లో అకౌంటెంటుగా పనిచేస్తున్న రమణ్ దీప్ సింగ్ ను చాంద్ దీప్ కౌర్ 2015 జూలైలో పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పట్నుంచే ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. పెళ్లి కాగానే అతడు ఆగస్టు నెలలో న్యూజిలాండ్ వెళ్లిపోయాడు. 2015 డిసెంబర్‌లో ఒకసారి భారతదేశానికి వచ్చి, మళ్లీ 2016 జనవరిలో వెళ్లిపోయాడు. అలా కేవలం 40 రోజులు మాత్రమే కలిసి ఉన్నప్పటికీ పెళ్లి అయినప్పటి నుంచి చాంద్ దీప్ కౌర్ తన అత్తగారి ఊరు అయిన జలందర్‌లోనే నివసిస్తోంది. అయితే చాంద్ దీప్ కౌర్ విషయంలో అత్తమామ ప్రేమానురాగాలకు బదులుగా చీత్కరింపులు ఎదురయ్యాయట. కొడుకును తాము వదిలేశామని చెప్తూ తనను పుట్టింటికి వెళ్లిపొమ్మన్నారని చాంద్ దీప్ వాపోయింది. తన బాధను చెప్తూ భర్తకు ఫోన్ చేయగా ఆయన ఏనాడూ స్పందించలేదని ఆమె తెలిపింది.
అత్తామామలు వెళ్లగొట్టడంతో తాను తల్లిదండ్రుల ఇంటికి వచ్చి తన అత్తమామల మనసు మార్చేందుకు ప్రయత్నం చేస్తుంటే వారు కనీసం ఫోన్ కూడా ఎత్తే ప్రయత్నం చేయలేదని వాపోయింది. విసిగి వేసారిన చాంద్ దీప్ కౌర్ 2016 ఆగస్టు నెలలో ఆమె తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలోనే ఆమెకు షాకింగ్ విషయాలు తెలిశాయి. రమణ్‌దీప్ సింగ్ తరచు నేరాలు చేస్తుంటాడని పంజాబ్ పోలీసులు ఆమెకు తెలియజేశారట. మరోవైపు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటికీ వారు ఆయన ఆచూకి తీయలేదు. అందుకే తన ఆవేదనను పంచుకుంటూ సుష్మా స్వరాజ్ కు ట్వీట్ చేశారు. తన భర్తను న్యూజిలాండ్ నుంచి డిపోర్ట్ చేయించి భారతదేశానికి రప్పించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తన భర్త పాస్ పోర్టు రద్దు చేయాలని, ఇలాంటి మగాళ్లకు బుద్ధి వచ్చేలా కఠినమైన చట్టాలు చేయాలని కూడా ఆమె కోరారు. తన కేసుకు సంబంధించిన పత్రాలు అన్నింటినీ పంపాల్సిందిగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి తనకు ఫోన్ వచ్చిందని చెప్పారు. అతడు తిరిగొచ్చి తనకు విడాకులు ఇస్తే తాను మళ్లీ కొత్తగా జీవితం ప్రారంభిస్తానని ఆమె ఆవేదన భరితంగా చెప్పింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/