Begin typing your search above and press return to search.

అసెంబ్లీ సాక్షిగా..టీఆర్ ఎస్ ఎమ్మెల్యే ఏడ్చింది

By:  Tupaki Desk   |   22 March 2016 11:56 AM GMT
అసెంబ్లీ సాక్షిగా..టీఆర్ ఎస్ ఎమ్మెల్యే ఏడ్చింది
X
తెలంగాణ అసెంబ్లీ సైతం మ‌హిళ ఎమ్మెల్యేల కంట‌త‌డికి వేదిక‌గా మారుతున్న‌ది. కాంగ్రెస్ సీనియ‌ర్‌ ఎమ్మెల్యే - మాజీ మంత్రి డీకే అరుణ చేసిన వ్యాఖ్యలకు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌ రెడ్డి స‌భ‌లోనే కంటతడి పెట్టారు. సంస్కారం లేని వారు సభ నడుపుతున్నారని డీకే అరుణ విమ‌ర్శించారు. అరుణ వ్యాఖ్యలతో పద్మా దేవేందర్‌ రెడ్డి తీవ్ర ఉద్విగ్నతకు లోనయి మనస్తాపంతో కన్నీరు పెట్టుకున్నారు. దీంతో స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొంది.

ఈ సంద‌ర్భంగా శాస‌న‌స‌భా వ్య‌వ‌హ‌రాల మంత్రి హరీష్‌ రావు జోక్యం చేసుకొని డీకే అరుణ వ్యాఖ్యలను ఖండించారు. సీనియ‌ర్ ఎమ్మెల్యే అయి ఉండి సంస్కారం లేని వారు సభ నడుపుతున్నారు అనడం సంస్కారమా అని ప్రశ్నించారు. అధ్య‌క్ష స్థానంలో ఉన్న వారిపట్ల అలా మాట్లాడటం సరైంది కాదని పేర్కొంటూ ఒక మహిళ పట్ల ఇలాగే ప్రవర్తిస్తారా అని నిల‌దీశారు. గతంలో పదం జారితే మంత్రుల హోదాలో ఉన్న తాము క్షమాపణ చెప్పామ‌ని అది త‌మ‌ సంస్కారమని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ...క్షమాపణ చెప్పకపోతే సస్పెండ్ చేయడానికి వెనుకాడమని ఆయ‌న స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తక్కువ మంది ఉన్నప్ప‌టికీ .. మాట్లాడానికి సమయం ఎక్కువ ఇచ్చారని గుర్తుచేశారు.

అనంత‌రం డిప్యూటీ స్పీక‌ర్ పద్మా దేవేందర్‌ రెడ్డి జోక్యం చేసుకొని...క్షమాపణ చెప్పాలా వద్దా అనేది డీకే అరుణ విచక్షణకే వదిలేస్తున్నానని పేర్కొన్నారు. స‌భ‌లో సీనియ‌ర్ స‌భ్యులు త‌మ‌కు మార్గ‌ద‌ర్శ‌కం వ‌హించాల్సింది పోయి ఇలా చేయ‌డం స‌రికాద‌ని అన్నారు.