Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డికి మరో ఉచ్చు.. అడ్డంగా బుక్ చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   27 Feb 2020 7:57 AM GMT
రేవంత్ రెడ్డికి మరో ఉచ్చు.. అడ్డంగా బుక్ చేస్తున్నారా?
X
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ అయిన రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకున్న భూ సమస్య ఆయనను మరింత చిక్కుల్లో పడేసినట్టు సమాచారం. హైదరాబాద్ లోనే ఖరీదైన ప్రాంతమైన గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో గోపనపల్లి వద్ద సర్వే నంబర్ 127లో 10.21 ఎకరాల పట్టా భూమి ఉంది. ఇది కోట్ల విలువైన భూమి. ఇందులో 6 ఎకరాల 7 గుంటలు రేవంత్ రెడ్డి అక్రమ మార్గంలో కొనుగోలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై అసలు భూమి హక్కుదారులు 2015లో హైకోర్టుకెక్కారు. రేవంత్ రెడ్డి ఈ భూములను అక్రమ మార్గం లో కొనుగోలు చేశారని.. అవి మా భూములు అని వాదించారు. ఈ భూపందేరంలో రేవంత్ రెడ్డి కి అప్పటి డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి సహకరించారని ప్రభుత్వం నిర్వహించిన దర్యాప్తులో తేలింది. దీంతో డిప్యూటీ కలెక్టర్ పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు పడింది.

అయితే తాజాగా తమ స్థలాన్ని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి అక్రమంగా వారి పేరిట రాయించుకున్నారని శ్రీశైలం అనే బాధితుడు ఆరోపించాడు. డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని వాపోయాడు. అడిగితే ఇక ఇచ్చేది ఏమీ లేదని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. లక్ష్మయ్య అనే వ్యక్తి నుంచి కొన్నట్టుగా రేవంత్, ఆయన సోదరుడు తప్పుడు పత్రాలు సృష్టించారని ఆరోపించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసి బెదిరిస్తున్నాడని వాపోయారు.

తాజాగా ఈ భూవివాదం పై ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. ఆరోపణలను ఖండించారు. ప్రభుత్వ పెద్దలే ఈ కుట్ర చేస్తున్నారని.. వారి అవినీతిని బయటపెడుతున్నందుకే తనపై ఇలా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బెదిరింపు రాజకీయాలకు భయపడేది లేదని తేల్చిచెప్పారు.