Begin typing your search above and press return to search.

తన కులం మీద ఆరోపణలపై స్పందించిన డిప్యూటీ సీఎం

By:  Tupaki Desk   |   20 April 2021 12:57 PM GMT
తన కులం మీద  ఆరోపణలపై స్పందించిన డిప్యూటీ సీఎం
X
ఎస్టీ కాదంటూ ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి కొందరు హైకోర్టుకు ఎక్కిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పిటీషన్ పై విచారణ సాగుతోంది. పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదంటూ ఆమె తప్పుడు ధ్రువపత్రాలతో ఎమ్మెల్యే, మంత్రి అయ్యారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. తనపై వస్తున్న కామెంట్స్ కు తాజాగా పుష్ప శ్రీవాణి స్పందించారు.

తన కులంపై కొందరు పనిగట్టుకొని ఆరోపణలు చేస్తున్నారని.. రాజకీయంగా నన్ను ఇబ్బందులు పెట్టాలనే ప్రయత్నంలో ఉన్నారని పుష్ప శ్రీవాణి ఆరోపించారు.

నేను ఎస్.టీ కొండ దొర వర్గానికి చెందిన వ్యక్తినేనని.. ఎస్టీ సర్టిఫికెట్ కారణంగా మా అక్క పశ్చిమ గోదావరి జిల్లాలో టీజర్ ఉద్యోగం కోల్పోయిందనేది సరికాదని పుష్ప శ్రీవాణి తెలిపారు. మా అక్కకు 2008లో స్పెషల్ డీఎస్సీలో ఉద్యోగం వచ్చిందని.. అయితే జీవో3 ప్రకారం నాన్ లోకల్ కి ఉద్యోగాలు ఇవ్వకూడదనే ఉద్యోగం నుంచి తొలగించారని డిప్యూటీ సీఎం వివరణ ఇచ్చారు.

2014లో మా కుటుంబం మొత్తానికి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్టీ సర్టిఫికెట్ ఇచ్చారని.. అప్పటికీ నేను రాజకీయాల్లోకి రాలేదని ఆమె తెలిపారు. మా తాత గారిది శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలోని టీడీ పారాపురం గ్రామం అని.. అక్కడ ఎవరైనా కులంపై విచారణ చేసుకోవచ్చని శ్రీవాణి తెలిపారు. విచారణ జరుగుతోందని.. ఆ రిపోర్ట్ రాగానే నాపై కుట్రలు చేసే వారు త్వరలో బయటపడుతారని పుష్ప శ్రీవాణి హెచ్చరించారు.