Begin typing your search above and press return to search.

ఏపీ డిప్యూటీ సీఎంకు టీడీపీ నేత‌ల షాక్‌

By:  Tupaki Desk   |   10 May 2016 4:47 PM GMT
ఏపీ డిప్యూటీ సీఎంకు టీడీపీ నేత‌ల షాక్‌
X
ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మ‌కాయ‌ల చినరాజ‌ప్ప‌కు గుంటూరు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో పెద్ద షాక్ త‌గిలింది. గుంటూరు న‌గ‌రంలో వివిధ అభివృద్ధి ప‌నుల నిమిత్తం చిన‌రాజ‌ప్ప మంగ‌ళ‌వారం ప‌ర్య‌టించారు. చిన‌రాజ‌ప్ప‌ను గుంటూరు తూర్పు నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ నేత‌లు ప‌లువురు అడ్డుకున్నారు. అభివృద్ధి ప‌థ‌కాల శిలాఫ‌ల‌కాల‌పై గుంటూరు తూర్పు నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఇన్‌ చార్జ్ మ‌ద్దాలి గిరిధ‌ర్‌ రావు పేరు లేక‌పోవ‌డంపై వారు చినరాజ‌ప్ప‌ను చుట్టుముట్టి త‌మ నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

న‌గ‌ర క‌మిష‌న‌ర్‌ నాగలక్ష్మికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గో బ్యాక్ నాగలక్ష్మి... గో బ్యాక్ నాగలక్ష్మి అంటూ నినాదాలు చేస్తూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో కాసేపు తూర్పు నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. చిన‌రాజ‌ప్పను టీడీపీ నేత‌లు చుట్టుముట్ట‌డంతో చివ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ గిరిధ‌ర్‌రావు, శ్రీనివాస్‌యాద‌వ్ వారికి స‌ర్దిచెప్ప‌డంతో శంకుస్థాపన సజావుగా జరిగింది.

గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన గిరిధ‌ర్‌ రావు వైకాపా అభ్య‌ర్థి షేక్ ముస్తఫా చేతిలో ఓడిపోయారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో త‌మ పార్టీ అధికారంలో ఉండ‌డంతో ఇన్‌చార్జ్ గిరిధ‌ర్‌రావుకు కూడా ప్రాధాన్యం ఇవ్వాల‌ని నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ నాయ‌కులు ప‌ట్టుబ‌డుతున్నారు. గ‌తంలో పలుసార్లు శిలాఫ‌ల‌కాల‌పై గిరి పేరు లేక‌పోవ‌డంతో వారు ఆందోళ‌న‌లు చేశారు. తాజాగా డిప్యూటీ సీఎం ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా వారు మ‌రోసారి త‌మ నిర‌స‌న తెలిపారు.

శంకుస్థాప‌న కార్య‌క్ర‌మాల అనంత‌రం చిన‌రాజ‌ప్ప మీడియాతో మాట్లాడుతూ క‌మిష‌న‌ర్ నాగ‌ల‌క్ష్మి గారు అనుభ‌వం ఉన్న అధికారి అని, మునిసిపాలిటీకి సంబంధించి రూ.160 కోట్ల నిధులు ఉన్నాయ‌ని, వీటిని న‌గ‌రంలో వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు వినియోగిస్తామ‌ని ఆయ‌న‌ మీడియాతో తెలిపారు.