Begin typing your search above and press return to search.

20 కార్లు ఒకేసారి ఢీకొన్నాయి

By:  Tupaki Desk   |   24 Jan 2016 10:42 AM GMT
20 కార్లు ఒకేసారి ఢీకొన్నాయి
X
హిమపాతం అమెరికా - చైనా వంటి దేశాలను వణికిస్తుంటే పొగమంచు ఢిల్లీని వణికిస్తోంది. ఆదివారం వేకువజామున 5.30 గంటలకు పొగమంచు ప్రభావంతో వరుస యాక్సిడెంట్లు జరిగాయి. దృగ్గోచరత దారుణంగా పడిపోవడంతో 40 మీటర్ల దూరం కూడా కనిపించక వాహన చోదకులు నానా ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీకి 75 కిలోమీటర్ల దూరంలో యమునా ఎక్స్ ప్రెస్ హైవేపై ఏకంగా 20 కార్లు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక కార్లు ఒకదాన్నొకటి ఢీకొనడంతో పలువురు గాయపడ్డారు. అయితే... పొగమంచు కారణంగా వాహనాలు తక్కువ వేగంతోనే వెళ్తుండడంతో 20 కార్లు ఢీకొన్నా భారీ నష్టమేమీ జరగలేదు. లేదంటే మరింత నష్టం కలిగేది.

కాగా.... ఉదయం 8.30 గంటల వరకు కూడా దాదాపుగా ఇదే పరిస్థితి కనిపించింది. తరువాత కూడా సుమారు 10 గంటల వరకు కూడా పొగమంచు భారీగానే ఉంది. ఉష్ణోగ్రత కూడా 7 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయింది. సుమారు 25 రైళ్లు రద్దు చేశారు. పొరుగుదేశం చైనాలోనూ మంచు వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచుతో పాటు హిమపాతం కూడా అక్కడ అధికంగా ఉండడంతో స్కూళ్లు, కార్యాలయాలకు సెలవులు ఇస్తున్నారు. ఇక అమెరికాలో అయితే భారీగా కురుస్తున్న మంచుతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి.