Begin typing your search above and press return to search.

ఈవిడేం ప్రిన్సిపాల్? 'పట్టా' కోసం వెళుతూ డ్యాన్స్ చేయటం నేరమా?

By:  Tupaki Desk   |   18 Jun 2023 10:24 AM GMT
ఈవిడేం ప్రిన్సిపాల్? పట్టా కోసం వెళుతూ డ్యాన్స్ చేయటం నేరమా?
X
స్వేచ్ఛా ప్రియత్వానికి ప్రపంచానికే మార్గదర్శనంగా ఉంటుందని గొప్పలు చెప్పే అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్నఒక ఉదంతం షాకింగ్ గా మారింది. ఈ ఉదంతం గురించి తెలిసినంతనే.. అమెరికానా? తాలిబన్ రాజ్యమా? అన్న సందేహం కలిగేలా ఉంటుంది. తన డిగ్రీ పట్టాను అందుకునేందుకు స్టేజ్ మీదకు వెళుతున్నఒక విద్యార్థిని సంతోషంతో డ్యాన్స్ చేస్తూ.. స్టేజ్ మీదకు వెళ్లిందని ఆమెకు ఇవ్వాల్సిన డిగ్రీని ఇవ్వకుండా తిప్పి పంపేసిన ఉదంతంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

అమెరికాలోని ఫిలడెల్ఫియాలోని హైస్కూల్ లో చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. విద్యార్థులంతా స్టేజ్ ముందు వరుసగా కూర్చున్నారు. ఒక్కొక్కర్నీ పిలిచి ప్రిన్సిపల్ లీసా మెసి పట్టాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో హఫ్సా అబ్దుర్ రహ్మాన్ అనే స్టూడెంట్ పేరును పిలవటంతో.. ఆమె తన చేతిలోని బొకేతో హ్యాపీగా స్టెప్పులు వేస్తూ స్టేజ్ మీదకు వెళ్లారు. ఆమె ఆనందంతో చేసిన పనికి సదరు ప్రిన్సిపల్ అతిగా స్పందించారు. ఆమెకు డిగ్రీ ఇవ్వటాన్ని నిరాకరిస్తూ.. చేతిలో ఉన్న డిగ్రీని కింద పడేశారు.

ఊహించని ఈ పరిణామానికి షాక్ కు గురైన ఆ విద్యార్థిని నిరాశతో కిందకు వచ్చేశారు. ఆ తర్వాత వేరే విద్యార్థిని పేరు పిలిచారు. ఈ ఘటనపై ప్రశ్నించిన మీడియాతో విద్యార్థిని తన బాధను.. ఆవేదనను పంచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావటం.. పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో.. విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. అదే సమయంలో.. గ్రాడ్యుయేషన్ డే ప్రోగ్రాం వేళ.. విద్యార్థులకు సదరు విద్యా సంస్థ పెట్టిన పరిమితులు బయటకు వచ్చి మరిన్ని విమర్శలు తోడయ్యాయి.

పట్టా తీసుకునేందుకు స్టేజ్ మీదకు వెళ్లేటప్పుడు తల్లిదండ్రులు కానీ స్నేహితులు కానీ చప్పట్లుకొట్టొద్దని చెప్పారని.. అయితే తాను తన సంతోషాన్ని నియంత్రించుకోలేక చిన్నగా డ్యాన్స్ వేసుకుంటూ వెళ్లిన విషయాన్ని బాధిత విద్యార్థిని వెల్లడించారు. తాను చేసింది తప్పే అయితే.. మిగిలిన వారు చేతులు ఊపటం.. గాల్లోకి ముద్దులు విసిరారు కదా? మరి.. వారు చేసింది తప్పు కాదా? అంటూ ప్రశ్నలు వేసింది.

ఈ మొత్తం ఎపిసోడ్ పై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో విద్యాశాఖ స్పందించింది. విద్యార్థులు సాధించుకున్న పట్టాల్ని ఇవ్వకుండా ఆపే అధికారం స్కూల్ కు ఉండదని స్పష్టం చేసింది. సంబంధిత ప్రిన్సిపల్ మీద చర్యలు తీసుకుంటామని చెప్పటంతో పాటు.. ఆ విద్యార్థిని.. వారి కుటుంబ సభ్యులకు జరిగిన అసౌకర్యానికి.. అవమానానికి చింతిస్తున్నట్లుగా ఒక ప్రకటన విడుదల చేశారు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు.