Begin typing your search above and press return to search.

రాహుల్ కామెంట్‌..బ్యాంకు వ‌ద్ద కాల్పులు

By:  Tupaki Desk   |   18 Dec 2016 5:22 AM GMT
రాహుల్ కామెంట్‌..బ్యాంకు వ‌ద్ద కాల్పులు
X
కొత్త క‌రెన్సీని అందుబాటులోకి తెచ్చుకునేందుకు బ్యాంకు వద్ద నెలకొన్న గందరగోళ పరిస్థితులతో ఓ కానిస్టేబుల్ గాలిలోకి కాల్పులు జరిపిన సంఘటన ఉత్తరప్రదేశ్‌ లోని బులంద్‌ షహర్ జిల్లా ఆహార్‌ లో చోటుచేసుకుంది. నగదు కొరతతో ఆహార్‌ లోని పంజాబ్ నేషనల్ బ్యాంకు బయట ఖాతాదారులు పెద్ద ఎత్తున క్యూలో నిలుచున్నారు. శాంతి అనే మహిళ నేరుగా బ్యాంకులోనికి వెళ్లడానికి ప్రయత్నించగా ఖాతాదారులు అడ్డుకున్నారు. ఆమె వెంటనే ఐదుగురు యువకులను రప్పించింది. వారు వస్తూనే బ్యాంకులోకి శాంతిని వెళ్లనీయకుండా అడ్డుకున్న వారిపై దాడి చేశారు. బ్యాంకు బయట ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అక్కడే ఉన్న కానిస్టేబుల్ జస్వీర్‌ సింగ్ పలుమార్లు గాలిలోకి కాల్పులు జరిపారు. దీంతో అక్కడ గుమిగూడిన జనం చెల్లాచెదురయ్యారు.

ఇదిలా ఉండ‌గా పెద్దనోట్ల రద్దు వల్ల తలెత్తిన పరిణామాలు సామాన్య - పేద ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయని, ఇదంతా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోదీ సృష్టించిన విపత్తు అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. కర్ణాటకలోని బెల్గాంలో కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. పేద ప్రజల డబ్బును నెలలపాటు బ్యాంకుల్లో స్తంభింపజేయాలనేది మోదీ అసలు ఉద్దేశమని ఆరోపించారు. పేదల నుంచి గుంజుకుని ధనవంతులకు కట్టబెట్టడం ఆయన కోరిక అని రాహుల్ వ్యాఖ్యానించారు. ఒక శాతం అత్యంత సంపన్నులకు లబ్ధి చేకూర్చేందుకు మోదీ దేశ ఆర్థిక వ్యవస్థపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. "పరిస్థితి 50 రోజుల్లో చక్కబడుతుందని మోదీ అంటున్నారు. కానీ ఏమాత్రం మెరుగుపడదని నేనంటున్నాను. మీ డబ్బు అంతా నాలుగైదు నెలలపాటు బ్యాంకుల్లోనే చిక్కుబడి ఉంటుంది. ఇది మోదీ మేడ్ డిజాస్టర్" అని వ్యాఖ్యానించారు.

నోట్లరద్దు అనంతరం వంద మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, రెండు నిమిషాలు మౌనం పాటించే సమయం బీజేపీ నాయకులకు లేదని రాహుల్ గాంధీ విమర్శించారు. "అవినీతి మీద ఎప్పుడు చర్యలు తీసుకుంటారని మేమడిగితే కొత్త డ్రామాను సృష్టించారు. మోదీజీ.. అది అవినీతి మీద సర్జికల్ స్ట్రయిక్ కాదు, పేదలు, రైతుల మీద ఫైర్ బాంబింగ్ అన్నారు. గత రెండేళ్ల‌లో ఒక శాతం ఉన్న అత్యంత ధనవంతులు దేశ సంపదలో 70 శాతాన్ని కూడబెట్టుకున్నారు. అక్రమధనం అంతా ఆ 50 కుటుంబాల్లోనే ఉంది" అని రాహుల్ ఆరోపించారు. అక్రమ ధనం ఆరు శాతమే నగదు రూపంలో, 94 శాతం మిగతా రూపంలో ఉంటుందన్నారు

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/