Begin typing your search above and press return to search.

వావ్‌..అమెరికా మ‌న‌ల్ని కాపీ కొట్టింది

By:  Tupaki Desk   |   24 Jun 2016 11:57 AM GMT
వావ్‌..అమెరికా మ‌న‌ల్ని కాపీ కొట్టింది
X
మనవాళ్లు అన్నింటికీ ఆమెరికాను ఆదర్శంగా తీసుకుంటుంటే, అమెరికా పార్లమెంటులో ప్రతిపక్ష సభ్యులు మాత్రం మన పార్లమెంటు సభ్యులను ఆదర్శంగా తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. మన దేశంలో చీటికి మాటికి ప్రతిపక్ష సభ్యులు ఏదో ఒక సమస్యపై పార్లమెంటులో వెల్‌ లోకి దూసుకెళ్లడం - ధర్నా చేయడం పరిపాటయిపోయిన విషయం తెలిసిందే. కాగా, అమెరికా ప్రతినిధుల సభలో డెమోక్రటిక్ పార్టీ సభ్యులు సైతం సేమ్ టు సేమ్ ఇదే ట్రెండ్ ఫాలో అయి వెల్‌ లోకి దూసుకెళ్లి ధర్నా చేశారు!

ఓర్లాండోలో గత వారం 48 మందిని పొట్టన పెట్టుకున్న కాల్పుల ఘటన నేపథ్యంలో గన్‌ కల్చర్‌ ను కట్టడి చేసేందుకు ప్రవేశపెట్టిన కఠిన చట్టాలపై ఓటింగ్ జరపాలని డిమాండ్ చేస్తూ డెమోక్ర‌టి స‌భ్యులంతా వెల్ లోపల బైఠాయించారు. అయితే సభలో మెజారిటీ ఉన్న అధికార రిపబ్లికన్ పార్టీ వారి డిమాండ్‌ కు అంగీకరించలేదు. అంతేకాదు ప్రత్యక్ష ప్రసారంకోసం ఉపయోగించే కెమెరాలను ఆపేసింది. అయితే ప్రతిపక్ష సభ్యులు వాళ్లకన్నా తక్కువేమీ తినలేదు. ఫేస్‌ బుక్ - ఇతర సామాజిక మాధ్యమాల సైట్లద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడానికి తమ స్మార్ట్ ఫోన్లకు పని చెప్పారు. ఆ దృశ్యాలు చూస్తే సభలో పరిస్థితి చాలా గందరగోళంగానే కనిపించింది.

స‌మావేశాలు వాయిదా పడడానికి ముందే ‘కామన్‌ సెన్స్ గన్ వయలెన్స్ ప్రివెన్షన్ చట్టం’పై ప్రతినిధుల సభ స్పీకర్ పౌల్ రియాన్ ఓటింగ్ నిర్వహించాలని డెమోక్రటిక్ పార్టీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అయితే వారి డిమాండ్‌ కు తలొగ్గడానికి నిరాకరించిన రియాన్ డెమోక్రటిక్ పార్టీ సభ్యులు చేస్తున్నంతా ఒక పబ్లిసిటీ స్టంట్ అంటూ కొట్టి పారేశారు. అది నంబర్ వన్ పాయింట్‌ గా పేర్కొన్న ఆయన ఈ బిల్లు ఇదివరకే సెనేట్‌ లో వీగిపోయిందని కూడా చెప్పారు. అన్నిటికీ మించి పౌరుల రాజ్యాంగపరమైన హక్కులను హరించాలనుకోవడం సరయిన పద్ధతి కాదని కూడా సిఎన్‌ ఎన్‌ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రియాన్ అన్నారు. సభలో లైట్లు - కెమెరాలు ఆపేయడాన్ని కూడా ఆయన గట్టిగా సమర్థించుకుంటూ - సభా నిబంధనల మేరకే ఆ పని చేసినట్లు చెప్పారు. అయితే ఇది ప్రజల ప్రాణాలు కాపాడడానికి, సమాజ రక్షణకు సంబంధించిన అంశం గనుక తుపాకుల హింస చట్టంపైన ఓటింగ్‌ కు రిపబ్లికన్ పార్టీ అంగీకరించి తీరాలని డెమోక్రటిక్ పార్టీ విప్ స్టెనీ హోయర్ డిమాండ్ చేశారు.

ఈ వారం ప్రారంభంలో అమెరికా సెనేట్‌ లో తుపాకుల నియంత్రణకు సంబంధించి నాలుగు సవరణలపై ఓటింగ్ జరిగింది. వీటిలో రెండు సవరణలను డెమోక్రాట్లు ప్రతిపాదించగా - మరో రెండింటిని రిపబ్లికన్లు ప్రవేశపెట్టారు. సెనేట్ ఈ నాలుగు సవరణలను తిరస్కరించింది. అయితే ఉగ్రవాద అనుమానితులు - దేశంలోకి అడుగుపెట్టడానికి అనుమమతించని వారి జాబితాలో ఉన్న వారు లేదా ఎఫ్‌ బిఐ వాచ్ లిస్టుల్లో ఉన్న వారు తుపాకులు కొనుగోలు చేయకుండా నిరోధించే ఒక రాజీ బిల్లును రూపొందించడంలో సభ్యులు విజ‌యం సాధించారు.