Begin typing your search above and press return to search.

‘నగరి’ని ‘బాలాజీ’లో కలపాలని డిమాండ్..: మున్సిపల్ ఏకగ్రీవ తీర్మానం

By:  Tupaki Desk   |   1 Feb 2022 9:30 AM GMT
‘నగరి’ని ‘బాలాజీ’లో కలపాలని డిమాండ్..: మున్సిపల్ ఏకగ్రీవ తీర్మానం
X
ఏపీలో జిల్లాల పునర్వవ్యవస్థీకరణ ప్రతిపాదనను ఇటీవల కేబినేట్ ఆమోదం తెలిసింది. అంటే ఇప్పుడున్న 13 జిల్లాలతో పాటు మరో 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 26 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ ఉంటుందన్న ప్రతిపాదనను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపడంతో వారు ఆమోదముద్ర వేశారు. అయితే ఉగాదిలోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే కొత్త జిల్లాల ఏర్పాటుపై కొన్ని చోట్ల ఇప్పటికే ఆందోళన మొదలయ్యాయి. ముఖ్యంగా తిరుపతి కేంద్రగా ఏర్పాటు కానున్న ‘బాలాజీ’ జిల్లా పేరు మార్చాలన్న డిమాండ్లు మొదలయ్యాయి. తాజాగా నగరి చిత్తూరు జిల్లాలో ఉన్న నగరి నియోజకవర్గాన్ని ‘బాలాజీ’ జిల్లాలో కలపాలన్న అంబేద్కర్ యువజన సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.

నగరి నియోజకవర్గానికి చెందిన అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో నగరిలో సోమవారం ఆందోళన చేశాయి. తమ నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. రెండు రోజుల్లో అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని అంటున్నారు. అంతేకాకుండా నగరి నియోజకవర్గాన్ని తిరుపతిలో కలపాలని ఎమ్మెల్యే కూడా డిమాండ్ చేయాలని వారంటున్నారు. ఈ మేరకు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బాబు మాట్లడుతూ కూతవేటు దూరంలో ఉన్న తిరుపతిని కాదని చిత్తూరు జిల్లాలో నగరి నియోజకవర్గాన్ని కలపారని ఆందోళన చేశారు.

వివిధ అవసరాలకు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటూ తిరుపతి కంటే చిత్తూరు సౌలభ్యంగా ఉండదని అంటున్నారుప బ్రహ్మణపట్టు గ్రామ పొలిమేర్లలోనే తిరుచానూరు ఉండగా అక్కడి ప్రజలు చిత్తూరుకు ఎలా వెళతారని ప్రశ్నించారు. అలాగే తుడ పరిధికి పుత్తూరు, నగరి కావాలి కానీ జిల్లా పరిధికి వద్దా.. అని ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు పుత్తూరు టౌన్ ను బాలాజీ జిల్లాలో చేర్చాలని జనసేన నాయకులు కోరుతున్నారు. ఈ మేరకు నగరని నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకుడు పి గోపి రాయల్ సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్ల కార్డులతో ఆందోళన చేశారు.

ఇదిలా ఉండగా నగరి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలపాలని సోమవారం జరిగిన మున్సిపల్ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. నియోజకవర్గం పూర్తిగా తుడ పరిధిలో ఉన్నందున పరిపాలన, అభివృద్ధి కోసం బాలాజీ జిల్లాలో చేర్చాలని డిమాండ్ చేశారు. నగరి నియోజకవర్గానికి చిత్తూరు సూదూరం అవుతుందని, అంతేకాకుండా రాకపోకల సౌకర్యాలు కూడా సరిగా లేవని అంటున్నారు. మరోవైపు నగరి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలపకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అంబేద్కర్ సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఈ విషయంలో ఏవిధంగా స్పందిస్తుందో చూడాలంటున్నారు.