Begin typing your search above and press return to search.

క్రికెట్ మ్యాచ్ ఏమో కానీ.. అభిమానుల సహనానికి పరీక్ష పెడుతున్నారుగా?

By:  Tupaki Desk   |   22 Sep 2022 5:31 AM GMT
క్రికెట్ మ్యాచ్ ఏమో కానీ.. అభిమానుల సహనానికి పరీక్ష పెడుతున్నారుగా?
X
క్రికెట్ మ్యాచ్ మీద ఉన్న అభిమానం పరీక్షగా మారింది. సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్ లో ఆదివారం జరుగుతున్న భారత్ - ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టికెట్ల కోసం పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు. దాదాపు 39వేల టికెట్లకు.. కనీసం 30 వేల టికెట్లు అమ్మాల్సిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్.. అందుకు భిన్నంగా వ్యవహరించటం.. ముందుస్తుగా చేసిన ప్రచారంలో భాగంగా పేటీఎం వేదికగా టికెట్లు అమ్మినట్లుగా ప్రకటించిన హైదరాబాద్ క్రికెట్ సంఘం.. ఎవరికి అమ్మారు? ఎన్ని టికెట్లు అమ్మారు? లాంటి ప్రశ్నలకు సమాధానాల్ని చెప్పలేకపోతోంది.

ఇదిలా ఉంటే.. బుధవారం సికింద్రాబాద్ లోని జింఖానా గ్రౌండ్స్ కు వేలాది మంది క్రికెట్ అభిమానులు చేరుకున్నారు. దీనికి కారణం.. ఆదివారం మ్యాచ్ కు టికెట్లను అమ్ముతున్నారన్న ప్రచారంతో నగరంలోని వేలాది మంది జింఖానా గ్రౌండ్స్ వద్దకు చేరుకొని టికెట్ల కోసం పెద్ద ఎత్తున నిరీక్షించారు. సహనం నశించి.. హెచ్ సీఏ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసే వరకు విషయం వెళ్లింది.

జింఖానా గ్రౌండ్స్ లో టికెట్లు అమ్ముతున్నారన్న సోషల్ మీడియాలో సాగిన ప్రచారమే దీనికి కారణమంటున్నారు. ఇదిలా ఉంటే.. వేలాది మంది జింఖానాకు వచ్చినా.. హెచ్ సీఏ అధికారులు ఎవరూ లేకపోవటం.. టికెట్ల అమ్మకంపై క్లారిటీ రాకపోవటంతో పలువురు గేట్లు దూకి మరీ గ్రౌండ్ లోకి ప్రవేశించారు. అక్కడి నుంచి కదిలేందుకు ససేమిరా అనటంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

టికెట్ల అమ్మకంపై గతంలో ఎప్పుడూ లేనంత గందరగోళం తాజా మ్యాచ్ విషయంలో చోటు చేసుకుంది. చాలా కాలం తర్వాత హైదరాబాద్ లో మ్యాచ్ నిర్వహిస్తుండటంతో.. ఈ మ్యాచ్ మీద విపరీతమైన క్రేజ్
ఏర్పడింది. అందులోకి ఆదివారం కూడా తోడు కావటంతో.. మ్యాచ్ ను నేరుగా చూడాలన్న తపన పెరిగింది. బుధవారం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో గురువారం జింఖానా గ్రౌండ్స్ లో మ్యాచ్ టికెట్లను అమ్ముతారన్న హామీని ఇవ్వటంతో అభిమానులు శాంతించారు.

మరి.. చెప్పినట్లే టికెట్లను అమ్ముతారా? అమ్మితే ఎన్ని అమ్ముతారు? 39 వేల టికెట్లలో కాంప్లిమెంట్ల రూపంలో 9వేల టికెట్ల ఇచ్చినా మిగిలిన 30 వేల టికెట్లను బహిరంగ మార్కెట్లో పెట్టి అమ్ముతారా? లేదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఒక అంతర్జాతీయ మ్యాచ్ కు అతిథ్యం ఇచ్చే అవకాశం వస్తే.. దాన్ని వివాదాస్పదగా మార్చటం హెచ్ సీఏకే చెల్లిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్ని టికెట్లు అమ్మకానికి పెట్టాలి? మరెన్ని టికెట్లుకాంప్లిమెంటరీ పాసులు ఇవ్వాలన్న దానిపై క్లారిటీ మిస్ అయిందని చెబుతున్నారు.

ఉప్పల్ స్టేడియంలో ఎప్పుడు మ్యాచ్ జరిగినా హెచ్ సీఏలోని 216 క్లబ్ లకు తలా 15 చొప్పున 3240 పాసులు కేటాయిస్తారు. మంత్రులు.. ఎమ్మెల్యేలు.. పోలీసులు.. ఉన్నతాధికారులు.. ప్రభుత్వ సిబ్బంది మొత్తానికి కలిపి 9వేల పాసుల్ని పక్కన పెట్టినా మిగిలిన 30 వేల టికెట్లను అమ్మాల్సి ఉంది. వీటిని ఆన్ లైన్ తో పాటు జింకానా మైదానం.. ఇతర కౌంటర్ల ద్వారా అమ్మేవారు. ఈసారి అందుకు భిన్నంగా పేటీఎంతో అమ్మకానికి పెట్టటం గందరగోళానికి కారణమైంది.

పేటీఎంలో టికెట్లు అమ్మినట్లు చెబుతున్నా.. నిజంగా ఎన్ని అమ్మారు? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పటం లేదు. ఒక లెక్క ప్రకారం 15వేల టికెట్లు అమ్మినట్లు చెబుతున్నా.. ఆ లెక్కన చూసినా మరో 15వేల టికెట్లుఅందుబాటులో ఉండాలి. కానీ.. దానికి సంబంధించిన ప్రకటన లేకపోవటం గందరగోళానికి తెర తీసింది. తాజాగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జింఖానా గ్రౌండ్స్ లో మ్యాచ్ టికెట్లు అమ్ముతారని చెబుతున్నారు. టికెట్ల అమ్మకంపై ఇప్పటివరకు జరిగిన రచ్చ ఒక ఎత్తు అయితే.. ఓపెన్ గా అమ్మకాలుపెట్టిన నేపథ్యంలో మరేం జరుగుతుందన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.