Begin typing your search above and press return to search.

కరోనా పుట్టింట్లో డెల్టా దూకుడు..చైనాలో పలు ప్రాంతాల్లో లాక్ డౌన్

By:  Tupaki Desk   |   3 Aug 2021 3:46 AM GMT
కరోనా పుట్టింట్లో డెల్టా దూకుడు..చైనాలో పలు ప్రాంతాల్లో లాక్ డౌన్
X
ప్రపంచం నెత్తి మీద నిప్పుల కుంపటిలా మారిన కరోనా.. ఎట్టకేలకు దాని పుట్టిల్లు అయిన చైనాలోనూ చెలరేగిపోతోంది. కరోనా ఆరంభానికి కేరాఫ్ అడ్రస్ అయిన డ్రాగన్ దేశంలో ఇప్పుడు డెల్టా కేసులు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. తాజాగా నమోదైన కేసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ.. తీవ్రత మాత్రం ఎక్కువగా ఉందన్న వార్తలు వస్తున్నాయి. కరోనా ఎపిసోడ్ మొదలైన తర్వాత.. అత్యధిక కేసులు వేర్వేరు ప్రాంతాల్లో వ్యాప్తి చెందటం ఇప్పుడా దేశాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చైనాలోని 20కు పైగా నగరాలు.. పదికి పైగా ప్రావిన్సుల్లో డెల్టా వేరియంట్ బయటపడినట్లుగా చెబుతున్నారు. దీంతో.. డెల్టా వేరియంట్ నుకట్టడి చేయటమే ప్రధమ కర్తవ్యం అన్నట్లుగా చైనా ప్రభుత్వం వ్యవమరిస్తోంది. డెల్టా కేసులు వెలుగు చూసిన ప్రాంతాల్లో కట్టడి చర్యలు తీసుకోవటంతో పాటు..ఆంక్షల కత్తి దూస్తోంది. లాక్ డౌన్ ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా చైనాలోని నాన్ జింగ్ ఎయిర్ పోర్టుకు వచ్చిన రష్యా విమానాన్ని శుభ్రం చేసిన తొమ్మిది మంది కార్మికులకు డెల్టా వేరియంట్ ను గుర్తించినట్లు చెబుతున్నారు. ఇలాంటి ఉదంతాలు డ్రాగన్ దేశానికి కొత్త దడగా మారాయి.

చైనా రాజధాని నగరమైన బీజింగ్ తో సహా పెద్ద నగరాల్లో కరోనా పరీక్షల సంఖ్య పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడికక్కడ కరోనా టెస్టులు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హునాన్ ప్రావిన్స్ లోని జుజౌ సిటీలో సోమవారం లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. లక్షలాది మంది ఇళ్లకే పరిమితమైన పరిస్థితి. ఇతర ప్రాంతాల నుంచి బీజింగ్ లోకి రాకుండా నిషేధ ఉత్తర్వులు జారీ చేశారు. పర్యాటక ప్రాంతమైన జాంగ్ జీజియాజీలో లాక్ డౌన్ విధించారు. చాంగ్ పింగ్ లోనూ లాక్ డౌన్ తప్పలేదు.

చైనాలోని హైనన్.. హెనాన్ ప్రావిన్స్ లో కొత్త కేసులు పెద్ద ఎత్తున బయటపడుతున్నాయి. కరోనా ఒరిజినల్ కేసుల కంటే కూడా డెల్టా వేరియంట్ ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఆ మాటకు వస్తే చైనా ఒక్క దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా డెల్టా వేరియంట్ ఇప్పుడు కొత్త ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా ఒరిజినల్ వైరస్ కంటే.. డెల్టా వేరియంట్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా ఆస్ట్రేలియా రాజధాని.. పెద్ద నగరాల్లో ఒకటైన సిడ్నీలో కొద్ది రోజులుగా లాక్ డౌన్ సాగుతోంది. దేశంలోనూ డెల్టా వేరియంట్ తో మూడో వేవ్ మొదలైనట్లేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరికి వారు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.