Begin typing your search above and press return to search.

వ్యాక్సినేషన్ బాగానే జరిగిన అమెరికాకు డెల్టా వణుకా? ఎందుకిలా?

By:  Tupaki Desk   |   9 Aug 2021 2:11 AM GMT
వ్యాక్సినేషన్ బాగానే జరిగిన అమెరికాకు డెల్టా వణుకా? ఎందుకిలా?
X
భారీఎత్తున సాగిన వ్యాక్సినేషన్. టీకా వేయించుకుంటే చాలు నజరానా. చాలా దేశాల్లో మాదిరి టీకాలకు కొరత అనేది లేకుండా.. ఆ మాటకు వస్తే బోలెడన్ని టీకాలు కుప్పలు.. కుప్పలుగా నిల్వ ఉంచేసి.. అవసరానికి మించి టీకాల్ని సేకరించిన ఆగ్రరాజ్యానికి ఇప్పుడో కొత్త సమస్య డెల్టా వేరియంట్ రూపంలో వచ్చేసింది. సెకండ్ వేవ్ ఒక ఊపు ఊపిన తర్వాత.. కేసుల నమోదు సంఖ్య కనిష్ఠంగా పడిపోయిన వేళ..ఊపిరి పీల్చుకుంటున్న అమెరికాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలాంటి పరిస్థితి మళ్లీ మొదలైంది. కరోనా కతను ఒక కొలిక్కి తెచ్చామన్న ధీమాతో ఉన్న అమెరికాకు.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు అనూహ్యంగా ఉంటున్నాయి.

జూన్ నెలాఖరుకు రోజుకు పదకొండు వేల కేసులు మాత్రమే నమోదయ్యే అమెరికాలో ఉన్నట్లుండి అమాంతంగా పెరుగుతున్న కేసులతో చేష్టలుడిగిపోయినట్లుగా ఉండాల్సి వస్తోంది. ఆగస్టు మూడు నుంచి రోజుకు లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. జూన్.. జులై మొదటి వారంలోనూ కేసుల సంఖ్య 20వేలు దాటని పరిస్థితికి భిన్నంగా క్రమేపీ కేసుల సంఖ్య పెరుగుతోంది.

2020లో కరోనా మొదటి వేవ్ లో కేసుల సంఖ్య లక్ష దాటటానికి అమెరికాకు తొమ్మిది నెలలు పడితే.. ఇప్పుడు మాత్రం ఆరు వారాల్లోనే ఈ సంఖ్య దాటేసే తీరు చూస్తే.. ఈ వైరస్ వ్యాప్తి ఎంత తీవ్రంగా ఉందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. తాజాగా రోజుకు లక్షన్నర కేసులు నమోదవుతూ.. ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఆసుపత్రుల్లో చేరే వారు ఎక్కువ కావటంతో పాటు.. మరణాల సంఖ్య కూడా ఎక్కువ అవుతున్నాయి. తాజాగా వెలువడుతున్న గణాంకాలు చూస్తే.. ఈ తీవ్రత ఎంత ఎక్కువన్నది ఇట్టే అర్థమవుతుంది. రెండు వారాల క్రితం రోజుకు కొవిడ్ మరణాలు 270గా ఉంటే.. శుక్రవారం నాటికి ఇది కాస్తా 700లకు చేరుకోవటం చూస్తే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందన్న విషయం అర్థమవుతుంది.

టీకా కార్యక్రమం భారీ ఎత్తున జరిగినప్పుడు.. కరోనా కేసులు ఇంత భారీగా ఎందుకు నమోదు అవుతున్నట్లు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. నమోదవుతున్న కేసుల్లో అత్యధికం డెల్టా వేరియంట్ గా చెబుతున్నారు. కేసుల ఎక్కువగా నమోదు కావటానికి కారణం ఏమిటన్న విషయంపై ప్రత్యేక ద్రష్టి పెడితే వెలుగు చూస్తున్న వాస్తవాలు షాకింగ్ గా మారాయి. అమెరికాలో ఎక్కువగా నమోదవుతున్న కేసులన్ని కూడా టీకా తీసుకోని వారి కారణంగానే అన్న మాట వినిపిస్తోంది.

ఈ వాదనకు బలం చేకూరేలా.. టీకా కార్యక్రమం తక్కువగా జరిగిన దక్షిణ ప్రాంతంలో ఇప్పుడు కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. డెల్టా వేరియంట్ తో ఇబ్బంది పడుతున్న పేషెంట్లు పెద్ద ఎత్తున చేరుతున్నారు. వీరితో ఆసుపత్రులన్ని కిక్కిరిసిపోతున్నాయి. ఇప్పటికైనా టీకాలు వేయించుకోని అమెరికన్లు వెంటనే టీకాలు వేసుకోవాలని.. లేకుంటే మరింత ముప్పు తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

దేశ వ్యాప్తంగా ఆసుపత్రుల్లో చేరే వారిలో ఎక్కువ మంది ఫ్లోరిడా.. జార్జియా.. అలబామా.. మిసిసిపీ.. ఉత్తర.. దక్షిణ కరోలినా.. టెన్నెస్సీ.. కెంటకీల్లోనే ఉంటున్నట్లు చెబుతున్నారు. టీకాలు వేయించుకోని వారి కారణంగా డెల్టా వేరియంట్ అమెరికాను చుట్టుముట్టి ఊపిరి పీల్చుకోవటానికి వీల్లేనంత ఒత్తిడిని పెంచేస్తోంది. దీని నుంచి బయటపడటానికి ఆ దేశం ఎంతటి భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందో?