Begin typing your search above and press return to search.

డెల్టా కల్లోలం: భారత్ లో ముగిసింది.. రష్యాలో మొదలైంది?

By:  Tupaki Desk   |   2 July 2021 12:30 AM GMT
డెల్టా కల్లోలం: భారత్ లో ముగిసింది.. రష్యాలో మొదలైంది?
X
ప్రపంచంలోనే అందిరికంటే ముందుగా టీకా తయారు చేసిన దేశం ఏది? ’ ఇది ఏమైనా క్విజ్ క్వచ్ఛనా అని ఆశ్చర్యపోకండి.. అందరికీ తెలిసిందే.. దీనికి ఠక్కున సమాధానం చెప్పేస్తారు అది ‘రష్యా’ టీకా స్పుత్నిక్ వి. సరిగ్గా ప్రయోగాలు జరపకముందే రెండు క్లినికల్ ట్రయల్స్ తోనే దీన్ని ఆమోదించి రష్యాలో పంచేశారు. అయితే ఆ టీకా అప్పటి కరోనాను ఎదుర్కొంది. కానీ ఆ తర్వాత రూపాంతరం చెందిన వైరస్ లను ఈ టీకా ఎదుర్కోవడం లేదని తేలింది.

కరోనా తొలి రకం వైరస్ కు ఇప్పుడు రూపాంతరం చెందిన డెల్టా, డెల్టా ప్లస్ కరోనా వైరస్ లకు చాలా తేడా ఉంది. ఈ డెల్టా ప్లస్ రకమే భారత్ లో సెకండ్ వేవ్ కు కారణమై దేశంలో మరణ మృదంగం వినిపించింది. ముఖ్యంగా యువతను బలితీసుకుంది. పెద్ద ఎత్తున దేశంలో చావులకు కారణమైంది. అందుకే ఇప్పుడు డెల్టా రకం అన్నా.. డెల్టా ప్లస్ అన్న ప్రపంచ దేశాలు హడలి చస్తున్నాయి.

ఇప్పటికే మన దేశంలో వెలుగుచూసిన డెల్టా రకం కరోనా వైరస్ బ్రిటన్ లోనూ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పుడు రష్యాకు పాకింది. రష్యాలో ‘స్పుత్నిక్ వి’ టీకాలు వేసినా అది దాన్ని ఎదుర్కోవడం లేదట.. డెల్టా రకం వైరస్ కారణంగా రష్యాలో ఇప్పుడు పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

రష్యా దేశంలో ఇప్పుడు డెల్టా కరోనా వైరస్ తో రెండోరోజు రికార్డ్ స్థాయిలో కోవిడ్ మరణాలు సంభవిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 21042 పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ఇందులో 669 మరణాలు నమోదైనట్లు బుధవారం రష్యా ప్రభుత్వం ప్రకటించింది.

దేశంలో డెల్టా వేరియంట్ ప్రారంభమైనప్పటి నుంచి ఒక్కరోజులో నమోదైన అత్యధిక కోవిడ్ మరణాల్లో ఇవే అధికం అని రష్యా తెలిపింది. మాస్కో, సెయింట్ పీటర్స్ బర్గ్ లో కరోనా మరణాలు అధికంగా ఉండడంతో అక్కడ ఆంక్షలు పెట్టారు. దేశంలో మరణాలకు 90శాతం డెల్టా వేరియంట్ కారణంగా తేల్చారు. మరణాలు మళ్లీ పెరుగుతున్నందున రష్యన్లు అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని అధ్యక్షుడు పుతిన్ మరోసారి సూచించారు. రష్యాలో వ్యాక్సిన్ తీసుకునేందుకు అక్కడి ప్రజలు వెనుకాడడమే ఈ దుస్థితి కారణంగా చెబుతున్నారు.

అయితే ఈ కేసులు పెరగడానికి యూరప్ లో నిర్వహిస్తున్న ‘యూరో 2021 ఫుట్ బాల్ టోర్నీ కారణమని తెలుస్తోంది. ఇటీవలే రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ నిర్వహించారు. ఇది ఇప్పుడు కోవిడ్ హాట్ స్పాట్ గా మారిందంటున్నారు. ఆ నగరంలోనే కరోనా మరణాలు అధికంగా నమోదు కావడం గమనార్హం. దీంతో రష్యాలో మరోసారి కరోనా కల్లోలం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. డెల్టా వేరియంట్ తో మరణ మృదంగం తప్పదనిపిస్తోంది.