Begin typing your search above and press return to search.

ఢిల్లీ టీఆర్ఎస్ భవన్ డిజైన్ అలా.. బడ్జెట్ ఫైనల్ చేశారా?

By:  Tupaki Desk   |   1 Sep 2021 12:30 AM GMT
ఢిల్లీ టీఆర్ఎస్ భవన్ డిజైన్ అలా.. బడ్జెట్ ఫైనల్ చేశారా?
X
ఏం చేసినా భారీతనం ఉట్టిపడేలా చేయటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలవాటు. టీఆర్ఎస్ ఫ్యూచర్ ఎంతన్నది ప్రశ్న తరచూ వినిపించే రోజుల్లోనే ఆయన నిర్మించిన తెలంగాణ భవన్ చూసి అచ్చెరువు చెందటం అప్పటి అధికారాపార్టీకి చెందిన కాంగ్రెస్ నేతల నోటి నుంచి తరచూ వినిపిస్తూ ఉండేది. పట్టుమని పది మంది ఎమ్మెల్యేలు లేని పార్టీకి.. ఈస్థాయిలో పార్టీ ఆఫీసా? అన్న ప్రశ్న ఎదురయ్యేది. అలా.. తన ఉనికి ప్రశ్నార్థకమని ప్రచారం చేసే రోజుల్లోనే కేసీఆర్ భారీతనాన్ని విడిచిపెట్టలేదు. అలాంటిది.. తెలంగాణ రాజకీయాల్లో సమీప భవిష్యత్తు వరకు కేసీఆర్ ను కొట్టే అధినేత ఎవరూ లేరన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. ఆయన తన ఇష్టానికి తగ్గట్లు భారీతనాన్ని వదులుకుంటారనుకోవటం తప్పే అవుతుంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తర్వాత ముఖ్యమంత్రి అధికార నివాసం అంటూ.. ఆయన కట్టించిన ప్రగతిభవన్ ఏ స్థాయిలో ఉందో.. తాను సేద తీరేందుకు సిద్ధం చేసుకున్న ఫామ్ హౌస్ ను చూసినప్పుడు.. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్ నిర్మాణం అందుకు ఏ మాత్రం తగ్గని రీతిలో ఉంటుందని చెబుతున్నారు. ఢిల్లీలో పార్టీ ఆఫీసును నిర్మించేందుకు వీలుగా స్థలాన్ని తీసుకొని.. దానిలో భారీ భవనాన్ని నిర్మించటానికి కేసీఆర్ ప్లాన్ చేశారు.

సెప్టెంబరు 2న ఆ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నారు. కేంద్రం కేటాయించిన 1100 చదరపు మీటర్ల స్థలంలో పార్టీ కార్యాలయం భారీగా చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. దేశంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పటికి అతి కొద్ది పార్టీలు మాత్రమే సొంత భవనాన్ని నిర్మించుకున్నాయి. అలా దేశ రాజధానిలో పార్టీ కార్యాలయం ఉన్న చాలా తక్కువపార్టీలో టీఆర్ఎస్ ఒకటి కానుంది. ఈ భవనం కోసం రూ.40 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ముందుగా అనుకున్న దాని ప్రకారం రూ.40 కోట్లకు అదనంగా రూ.20 కోట్ల వరకు అవుతుందన్న మాట వినిపిస్తోంది.

తెలంగాణ భవన్ మాదిరే.. ఢిల్లీ టీఆర్ఎస్ భవనం కూడా ఉంటుందని చెబుతున్నారు. ఇదే డిజైన్ ను ఫాలో అవుతారన్న మాట వినిపిస్తోంది. వచ్చే దసరా నాటికి నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ భవనాన్ని ప్రారంభించే సమయంలో జాతీయ స్థాయి నేతల్ని పిలవాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతారు. ఢిల్లీలోని వసంత్ విహార్ మెట్రో స్టేషన్ సమీపంలో పార్టీ ఆఫీసు ఉండనుంది. శంకుస్థాపన కోసం బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు.