Begin typing your search above and press return to search.

కరోనాకు తోడైన ఢిల్లీ ఫీవర్.. ఏం జరగనుంది?

By:  Tupaki Desk   |   29 March 2020 3:30 PM GMT
కరోనాకు తోడైన ఢిల్లీ ఫీవర్.. ఏం జరగనుంది?
X
కొద్దిరోజుల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో ఒక మత సమావేశం జరిగింది. దీనికి దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఢిల్లీకి వెళ్లారు. ఒక అంచనా ప్రకారం ఒక్క ఏపీ నుంచే సదరు మత సభకు వెళ్లిన వారి సంఖ్య 1500 వరకు ఉండొచ్చని అంటున్నారు. అంతదాకా ఎందుకు.. ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచే దగ్గర దగ్గర పదహారు మంది వరకూ వెళ్లారని చెబుతున్నారు. ఈ లెక్కన ఆ రాష్ట్రంలో 13 జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే.. ఈ సంఖ్య భారీగా ఉంటుంది. ఇక.. తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున ఢిల్లీకి వెళ్లారని అంచనా వేస్తున్నారు. వీరంతా సామూహిక ప్రయాణాలు చేయటం ఆందోళన కలిగించే అంశమైతే.. ఎక్కువమంది రైలు ప్రయాణాలు చేసినట్లుగా తెలుస్తోంది.

దేశ రాజధాని నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలంటే 12 గంటల నుంచి ముప్ఫై గంటల వరకూ జర్నీ చేసిన వారు పెద్దసంఖ్యలో ఉంటారని.. అంతకు మించి కూడా ఉండొచ్చన్నది ఒక అంచనా. ఇలా వెళ్లిన వారిలో ఇప్పటివరకూ పలు పాజిటివ్ కేసులు నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో..సదరు సమావేశానికి వెళ్లి వచ్చిన వారు.. వారి కారణంగా మరెంతమంది ప్రభావితమయ్యారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

ఈ మత సభకు వెళ్లి వచ్చిన వారిలో పలువురికి కరోనా పాజిటివ్ రావటం.. తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకున్న మరణం కూడా తోడు కావటంతో ఆందోళన మరింత పెరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వీరిని గుర్తించటంతో పాటు.. వీరిలో ఎంతమందికి కరోనాపాజిటివ్ గా తేలిందన్న సమాచారాన్ని అంచనా వేసే ప్రయత్నంలో ఉన్నారు. దీంతో.. ఇప్పుడు వచ్చే కేసుల్లో అత్యధికం సదరు ఢిల్లీలో నిర్వహించిన మత సభకు వెళ్లి వచ్చిన వారి హిస్టరీ ఉన్న వారికి సంబంధించిన ఆరా తీయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నారు.

ఇప్పటివరకూ కరోనా లక్షణాలతో వచ్చిన వారిని తొలుత వారి ఫారిన్ హిస్టరీ అడిగి తెలుసుకుంటున్నారని.. దాని ద్వారా తీవ్రతను అంచనా వేసేప్రయత్నం చేస్తున్నట్లు చెబుతున్నారు. మారిన సీన్ తో.. ఇప్పుడు విదేశీ పర్యటనల వివరాలతోపాటు.. ఢిల్లీలో జరిగిన మత సంబంధిత కార్యక్రమానికి హాజరయ్యారా? అన్న విషయాన్ని చెక్ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు.