Begin typing your search above and press return to search.

2048 ఒలంపిక్స్ కి ఢిల్లీ ఆతిథ్యం !

By:  Tupaki Desk   |   12 March 2021 2:30 AM GMT
2048 ఒలంపిక్స్ కి ఢిల్లీ ఆతిథ్యం !
X
భారత దేశ రాజధాని ఢిల్లీ 2048 ఒలింపిక్‌ క్రీడల ఆతిథ్యం కోసం బిడ్‌ వేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ చెప్పారు. ఆ లక్ష్యం నెరవేరే దృక్పథంతోనే ఢిల్లీ బడ్జెట్ ‌ను రూపొందించామన్నారు. విశ్వక్రీడల నిర్వహణ కోసం అవసరమైన నిర్మాణాలు, మౌలిక సదుపాయాలను సృష్టించేందుకు చర్యలు ప్రారంభిస్తాం అని అసెంబ్లీలో కేజ్రీవాల్‌ మంగళవారం చెప్పారు. 2048 లో ఢిల్లీ లో ఒలింపిక్‌ క్రీడల జరిగేలా ఓ విజన్ ను రూపొందించాము అని ,దీనికి కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం అని అన్నారు. దీనికోసం బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయిస్తాం అన్నారు.

ఇదే నేపథ్యంలో .. 2048 అనేది చాలా దూరంలో ఉన్నట్టు కనిపిస్తున్నదని, కానీ ఒలింపిక్స్‌ కోసం పదేండ్ల ముందే బిడ్‌ వేయాల్సి ఉంటుందని బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా ఢిల్లీ ఆర్థిక మంత్రి మనీశ్‌ సిసోడియా చెప్పారు. ఢిల్లీలో రెండుసార్లు ఆసియా క్రీడలు జరుగగా.. 2010లో కామన్వెల్త్‌ క్రీడలకు సైతం ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. ఇక టోక్యోలో ఒలింపిక్స్‌ గత ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు జరగాల్సి ఉండగా.. కరోనా వైరస్‌ కారణంగా వాయిదా వేశారు. ఈ క్రీడలను తిరిగి ఈ ఏడాది జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు జరుపాలని ఒలింపిక్‌ క్రీడల నిర్వాహక కమిటీ నిర్ణయించింది. ఒలింపిక్స్‌ కోసం వివిధ దేశాల నుంచి దాదాపు 70 వేల మందికి పైగా క్రీడాకారులు, సిబ్బంది జపాన్‌ రానున్నారు.

ఒలింపిక్ క్రీడలను వీక్షించేందుకు ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించనున్నారు. అయితే ప్రేక్షకుల సంఖ్యను 20 వేలకు మించకుండా చూడనున్నట్లుగా సమాచారం. ఇలాఉండగా, ఒలింపిక్స్ కు హాజరయ్యే క్రీడాకారులు, సిబ్బందికి వాక్సిన్లు తీసుకోవడం తప్పనిసరి చేయడం వంటి నిర్ణయాన్ని ఇంతవరకు ఒలింపిక్‌ కమిటీ తీసుకోలేదు. అయితే, టోక్యోకు బయల్దేరే భారత క్రీడాకారులకు టీకాలు వేయనున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు వెల్లడించారు.