Begin typing your search above and press return to search.

ఢిల్లీ ఆక‌లి చావుల వెనుక నిజం తెలిస్తే షాకే!

By:  Tupaki Desk   |   27 July 2018 4:23 AM GMT
ఢిల్లీ ఆక‌లి చావుల వెనుక నిజం తెలిస్తే షాకే!
X
ఖ‌రీదైన సూటుబూటుతో వెలిగిపోయే ప్ర‌ధాన‌మంత్రి మోడీగా ఉన్న వేళ‌.. ఆక‌లి బాధ తాళ లేక ముగ్గురు మైన‌ర్లు మ‌ర‌ణించిన వైనం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. అయితే.. ఈ మైన‌ర్లు దేశంలో మ‌రెక్క‌డైనా ఉంటే ప‌రిస్థితి మ‌రోలా ఉండేది. దేశ రాజ‌ధానిలో ఉంటూ.. ఆక‌లి బాధ త‌ట్టుకోలేక మ‌ర‌ణించ‌టం ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతోంది.

ఒక‌ప‌క్క ఆఫ్రికా ఖండంలోని ఒక దేశంలో వెనుక‌బాటుత‌నాన్ని పొగ్గొట్టేందుకు ఆవుల్ని ఉచితంగా ప్ర‌ధాని మోడీ పంపిణీ చేసిన రెండు రోజుల వ్య‌వ‌ధిలోనే వెలుగులోకి వ‌చ్చిన ఈ ఆక‌లి చావులు అంద‌రిని క‌దిలిస్తున్నాయి.

ఆక‌లితో మృతి చెందిన ముగ్గురు మైన‌ర్ల‌కు శ‌వ‌ప‌రీక్ష చేసిన వైద్యులు నివ్వెర‌పోయారు. ఎందుకంటే.. వారి శ‌రీరం మొత్త‌మ్మీదా కొవ్వు అన్న‌ది మిగ‌ల్లేద‌ని.. ఆహారం కోసం వారెంత‌గా అల‌మ‌టించారో వారి శ‌రీరాల్ని చూస్తే తెలుస్తుంద‌ని చెబుతున్నారు.

అక్కా చెల్లెళ్లు అయిన ముగ్గురి వ‌య‌సును చూస్తే.. 8.. 4.. 2.. ఏళ్లుగా చెబుతున్నారు. ఈ మైన‌ర్ల‌ త‌ల్లిని తాజాగా ఆసుప‌త్రిలో చేర్చి ఆమెకు వైద్యం చేస్తున్నారు. మ‌రోవైపు మృతి చెందిన చిన్నారుల తండ్రి జాడ తెలియ‌రావటం లేదు. దిన‌స‌రి కూలీగా ఉంటాడ‌ని చెబుతున్న అత‌గాడి కోసం గాలిస్తున్నారు.

వీరి మృతిపై అనుమానాలు వ్య‌క్తం కావ‌టంతో మ‌రోసారి శ‌వ‌ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు.ఈ సంద‌ర్భంగా విడుద‌లైన నివేదిక‌లో మైన‌ర్ల శ‌రీరాల‌పై ఎలాంటి గాయాలు లేవ‌ని.. వారి క‌డుపుల‌న్నీ ఖాళీగా ఉన్నాయ‌ని.. క‌నీసం వారానికి పైనే వారేమీ తిని ఉండ‌ర‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. దాదాపు ఎనిమిది.. తొమ్మిది రోజులుగా ఆ చిన్నారులు ఏమీ తిని ఉండ‌క‌పోవ‌చ్చ‌ని.. వారి మ‌ల‌ద్వారం ఖాళీగా ఉంద‌ని.. క‌డుపులో ఆహారం లేద‌ని.. క‌నీసం కొవ్వు ఒక్క‌శాతం కూడా లేద‌ని చెబుతున్నారు. ఇంత ద‌య‌నీయ‌మైన ఆక‌లి దేశ రాజ‌ధానిలో ఉండ‌టంపై ప‌లువురు విస్మ‌యానికి గురి చేస్తున్నారు. ఈ ఆక‌లి చావులు రాజ్య‌స‌భ‌లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. ముగ్గురు మైన‌ర్ల మ‌ర‌ణానికి దారి తీసిన ప‌రిస్థితుల్ని తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెబుతున్నారు.