Begin typing your search above and press return to search.

ఢిల్లీలో పెరేడ్ కోసం చేరుకున్న ట్రాక్టర్ల సంఖ్య తెలిస్తే అవాక్కే

By:  Tupaki Desk   |   25 Jan 2021 4:10 AM GMT
ఢిల్లీలో పెరేడ్ కోసం చేరుకున్న ట్రాక్టర్ల సంఖ్య తెలిస్తే అవాక్కే
X
వారంతా రైతులు.. పొలం పనుల్లో బిజీగా ఉండే వారంతా మోడీ సర్కారు తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గళం విప్పారు. క్యాలెండర్లో నెలలు గడుస్తున్నాయి. రైతులు చేస్తున్న నిరసనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కానీ.. మోడీ సర్కారు మాత్రం.. నిరసనలను తగ్గించేందుకు.. ఆందోళనలకు ముగింపు పలికేందుకు భారీ నిర్ణయాల్ని తీసుకునేందుకు సిద్ధంగా లేదన్న వాదన వినిపిస్తోంది. వణికించే చలిలో వేలాది మంది చేస్తున్న ఆందోళనను మరోస్థాయికి తీసుకెళ్లేందుకు.. కేంద్రంపై ఒత్తిడిని తీవ్రతరం చేసేందుకు వీలుగా రైతులు జనవరి 26న (గణతంత్ర దినోత్సవం) దేశ రాజధాని ఢిల్లీ శివారులో భారీ ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇందుకోసం ఇప్పటికే వేలాది ట్రాక్టర్లు ఉద్యమ ప్రాంతానికి చేరుకున్నాయి. ఏదో చేస్తున్నామంటే చేస్తున్నట్లు కాకుండా.. పద్దతిగా.. పక్కా ప్లానింగ్ తో చేస్తున్న ఈ నిరసన ప్రదర్శన చూస్తే.. ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమానికి ఏ మాత్రం తగ్గని ప్లానింగ్ తో.. ప్రణాళికా బద్ధంగా జరుగుతుండటం గమనార్హం. అంతేకాదు.. నిరసనను ఇష్టారాజ్యంగా కాకుండా.. వ్యూహాత్మకంగా నిర్మించటమే కాదు.. వినూత్నంగా ఉండేలా ప్లాన్ చేయటాన్ని చూస్తే అవాక్కు అవ్వాల్సిందే.

ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ర్యాలీలో పాల్గొనేందుకు 12వేల ట్రాక్టర్లు ఢిల్లీవైపు వెళుతున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. శుక్ర.. శనివారాల్లో పదివేల ట్రాక్టర్లు దవోబా ప్రాంతానికి చేరుకున్నట్లుగా చెబుతున్నారు. హర్యానాలో కుల పంచాయితీలు నిర్వహించే (ఖాప్ పంచాయితీలు) వారి తరఫు నుంచి దాదాపు రెండు వేలకు పైగా ట్రాక్టర్లు ఢిల్లీకి పంపించనున్నారు.

అంతేకాదు.. ఈ ర్యాలీ కోసం 40 అంబులెన్సులు.. 2500 మంది వాలంటీర్లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.ర్యాలీ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికి మాజీ సైనికులు భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రతి ట్రాక్టరు పైనా ఐదుగురికి మాత్రమే అనుమతి ఇస్తారు. ర్యాలీలో ఏదైనా ట్రాక్టర్ రిపేర్ కారణంగా ఆగిపోతే.. చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. అందుకే.. అలాంటి సమస్య ఎదురు కాకుండా ఉండేందుకు మెకానిక్కుల టీంను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.

ప్రభుత్వం నిర్వహించే గణతంత్ర వేడుకలు ముగిసిన తర్వాత ఈ కార్యక్రమం ఉంటుందని చెబుతున్నారు. అవుటర్ రింగు రోడ్డులో 100కి.మీ. మేర ప్రయాణించిన తర్వాత సాయంత్రం ఆరు గంటల వేళలో ముగుస్తుందని చెబుతున్నారు. ర్యాలీ ముగిసిన తర్వాత దీక్షా స్థలికి చేరుకుంటారు. ఈ పెరేడ్ లో పాల్గొనేందుకు పంజాబ్.. హర్యానాల నుంచి పెద్ద ఎత్తున ట్రాక్టర్లు బయలుదేరాయి.

రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రాల వారీగా ఏ రీతిలోఅయితే శకటాల్ని ప్రదర్శిస్తారో.. అదే రీతిలో ఢిల్లీలో జనవరి 26న రైతులు తమ సమస్యల్ని శకటాలుగా మర్చి తమ డిమాండ్లను కళ్లకు కట్టినట్లుగా చూపించాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇందుకోసం 30 ట్రాక్టర్లను కేటాయించినట్లుగా తెలుస్తోంది.

ఇందులో వ్యవసాయ చట్టాలతో కలిగే నష్టంతో పాటు.. వ్యవసాయం.. పల్లె జీవితాలు.. మహిళల పాత్ర.. పశువుల పెంపకం లాంటి అంశాలు ఉంటాయని చెబుతున్నారు. రైతుల ఆత్మహత్యలపైన ఒక శకటాన్ని ప్రదర్శిస్తారు. ఇందులో విదర్భ ప్రాంతానికి చెందిన ఆత్మహత్యకు పాల్పడిన కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు. ఈ ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొనే ప్రతి ట్రాక్టర్ పైనా జాతీయ జెండా ఉంటుంది. పక్కా ప్లానింగ్ తో చేస్తున్న ఈ పెరేడ్.. వారు అనుకున్నట్లు సాగితే.. దేశ చరిత్రలో అత్యంత నిర్మాణాత్మకంగా సాగిన నిరసన పరేడ్ గా మిగులుతుందని చెప్పక తప్పదు.