Begin typing your search above and press return to search.

‘తబ్లిఘీ’ గుట్టురట్టు చేసిన ఏపీ పోలీసులు.. ఎలా సాధ్యమైంది?

By:  Tupaki Desk   |   3 April 2020 4:00 PM GMT
‘తబ్లిఘీ’ గుట్టురట్టు చేసిన ఏపీ పోలీసులు.. ఎలా సాధ్యమైంది?
X
దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఢిల్లీలోని నిజాముద్దీన్ లో జరిగిన ‘తబ్లిఘీ’ జమాత్ సమావేశాలపైనే చర్చ జరుగుతోంది. దేశంలో ఇప్పుడు కరోనా ఇంతలా వ్యాపించడానికి కారణం ఢిల్లీ లో నిర్వహించిన ఈ ‘తబ్లిఘీ’ సమావేశాలే. మరి గుట్టుగా సాగిన ఈ సమావేశాలను వెలుగులోకి తీసుకొచ్చింది ఏపీ పోలీసులే.. తెలంగాణలోని కరీంనగర్ లో పర్యటించిన ఇండోనేషియన్లు అక్కడ కరోనా వ్యాపింప చేసినప్పటికీ వారు కూడా ఢిల్లీలో తబ్లిఘీ సమావేశానికి హాజరైనట్టు తెలంగాణ పోలీసులు సైతం గుర్తించలేదు. కానీ ఏపీ పోలీసులే దీన్ని ఎలా ఛేదించారన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

మార్చి 27న గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా బావమరిదికి కరోనా పాజిటివ్ సోకింది. అతడితోపాటు ఎమ్మెల్యే ముస్తఫాను క్వారంటైన్ కు తరలించారు. అక్కడ కూపీలాగిన ఏపీ పోలీసులకు ‘తబ్లిఘీ’ సమావేశాల గుట్టు తెలిసింది. ఆ తర్వాత ప్రకాశం జిల్లాలో కూడా ఈ ఢిల్లీ తబ్లిఘీ సమావేశానికి వెళ్లిన వారికి కరోనా సోకింది. వారిని విచారించగా తబ్లిగీ సమావేశానికి వేల మంది హాజరైనట్టు తేలింది.. దీంతో దీనిపై పరిశోధించిన ఏపీ పోలీసులకు ఏపీ వ్యాప్తంగా వందలాది మంది ఈ సభకు హాజరైనట్టు గుర్తించారు. భారతదేశం అంతటా ఈ మర్కాజ్ వద్ద జరిగిన సమావేశాలకు ఏకంగా 13702మంది హాజరైనట్టు ఏపీ పోలీసులు కనుగొన్నారు.

13,702 మందిలో, దాదాపు 7,930 మందికి కరోనా వైరస్ సంక్రమించే ప్రమాదం ఉందని, 5,772 మంది ప్రమాదంలో ఉన్నారని వారు పోలీసులు , వైద్య నిపుణులు తెలిపారు. తెలంగాణ , ఏపిలలో తబ్లిఘీ సమావేశాలకు వెళ్లిన వారిని.. వారి కుటుంబ సభ్యులను గుర్తించి క్వారంటైన్ కు తరలించారు. వీరందరికీ కరోనా పరీక్షలు చేస్తుండగా పెద్ద ఎత్తున బయటపడుతోంది.

దీంతో ఏపీ, తెలంగాణలోనే కాదు.. దేశవ్యాప్తంగా తబ్లిఘీ సమావేశాలకు హాజరైన వారిని ఆయా రాష్ట్రాలు, కేంద్రం గుర్తించి క్వారంటైన్ కు తరలిస్తున్నాయి. వీరి వల్లే దేశంలో కరోనా కేసులు పెరిగే అవకాశం కనిపిస్తోంది. వచ్చే 10 రోజులు భారతదేశానికి చాలా క్లిష్టమైనవిగా కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం, ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదికల ప్రకారం భారతదేశంలో 2వేలకు పైగా అధికారికంగా కేసులు నమోదై ఉన్నాయి. ఈ సంఖ్య డబుల్ కావచ్చని అంటున్నారు. ఏపీ పోలీసుల పరిశోధన వల్లే ఇప్పుడు దేశంలో కరోనా మరింత వ్యాపించకుండా తబ్లిఘీ సమావేశాలకు హాజరైన వారిని క్వారంటైన్ కు తరలించే అవకాశం కలిగింది. వారంతా బయట తిరిగితే పెను విధ్వంసమే చోటుచేసుకునేంది.