Begin typing your search above and press return to search.

ఉద్యోగికి కరోనా సోకిందని ఫ్యాక్టరీ మూసేశారు

By:  Tupaki Desk   |   13 March 2020 8:30 PM GMT
ఉద్యోగికి కరోనా సోకిందని ఫ్యాక్టరీ మూసేశారు
X
కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకులా వణికిపోతున్నాయి. జనం భారీ సంఖ్యలో గుమిగూడే అవకాశమున్న కార్యక్రమాలు, క్రీడా వేడుకులు, క్రికెట్ మ్యాచ్ లు రద్దు చేస్తు ముందు జాగ్రత్తపడుతున్నాయి. ఇక, కరోనా దెబ్బకు ప్రత్యేకించి ఐటీ కంపెనీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆన్ సైట్ వర్క్ కోసం విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చిన వారికి క్షుణ్ణంగా పరీక్షలు జరుపుతున్న ఐటీ కంపెనీలు...ఏ మాత్రం అనుమానం వచ్చినా తమ ఉద్యోగులను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నాయి. రిస్క్ తీసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడని కంపెనీలు....తమ ఉద్యోగులను తరచి తరచి పరీక్షిస్తున్నాయి. ఇక తాజాాగా, నోయిడాలోని ఓ ఫ్యాక్టరీ లో పనిచేసే ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తేలడం తో ఆ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ కంపెనీని తాత్కాలికంగా మూసివేయడంతోపాటు అందులో పనిచేస్తోన్న 707 మంది ఉద్యోగులను హోమ్ క్వారంటైన్(ఇంటిలోనే దిగ్భందనం)చేసిన ఘటన ఇపుడు చర్చనీయాంశమైంది. దీంతోపాటు, ఆ ఫ్యాక్టరీని పూర్తిగా శానిటైజ్ చేసేందుకు యాజమాన్యం సిద్ధపడింది.


నోయిడాలోని లెదర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలో ఢిల్లీకి చెందిన ఒక యువకుడు ఉద్యోగం చేస్తున్నాడు. ఆఫీసు పనిమీద ఇటలీ, స్విట్జర్లాండ్, చైనా, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించిన ఆ యువకుడు....ఇటీవల నోయిడాకు వచ్చాడు. ఇండియాకు వచ్చిన అతడికి కరోనా లక్షణాలు కనిపించడంతో...వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో అతడికి కరోనా పాజిటివ్ అని తేలడం తో వైద్యాధికారులు, ఫ్యాక్టర యాజమాన్యం అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం బాధితుడు ఢిల్లీలోని సఫ్థార్ గంజ్ హాస్పిటల్ లోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నాడు. దీనికి తోడు కంపెనీలో పనిచేస్తున్న మొత్తం 707 మంది ఉద్యోగులను కూడా హోమ్ క్వారంటైన్ కు తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కేసు తో భారత్ లో ఇప్పటివరకు కరోనా సోకినవారి సంఖ్య 78కి చేరింది.

కాగా, భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఏప్రిల్-15, 2020 వరకు విదేశీయులు భారత్ లోకి ఎంటర్ కాకుండా వీసాలను రద్దు చేసంది. మార్చి 13,2020 నుంచి వీసా రద్దు అమల్లోకి వచ్చింది. ఎక్కువగా జనసమీకరణ ఉండే కార్యక్రమాలు రద్దు చేసుకోవాలని సూచించింది. వీలైనంత వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవడమే మంచిదని అధికారులు సూచిస్తున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు బ్రిటీష్ కాలం నాటి ఎపిడమిక్ డిసీజస్ యాక్ట్(అంటువ్యాధుల నివారణ చట్టం) 1897లోని సెక్షన్ 2ను భారత ప్రభుత్వం ప్రయోగించింది. ఈ చట్టం ప్రకారం కరోనా వంటి వైరస్ ను నియంత్రించడానికి దేశంలోని అన్ని రాష్ట్రాలలో అన్ని విద్యా సంస్థల్ని మూసి వేయడానికి, సరిహద్దు ప్రాంతాలని సీజ్ చేయడానికి, రోగులని హాస్పిటల్‌లో కానీ, నిర్బంధం‌లో కానీ ఉంచే అధికారం ఉంటుంది.